logo

డీఎంకే పరిపాలనపై ప్రజల హర్షం

ప్రజలకు డీఎంకే ప్రభుత్వం మంచి చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. నామక్కల్‌ జిల్లా బొమ్మకుట్టైలో ఆదివారం ఏర్పాటు చేసిన స్థానిక సంస్థ ప్రతినిధుల మహానాడులో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

Published : 04 Jul 2022 00:36 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌

ప్రసంగిస్తున్న స్టాలిన్‌

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ప్రజలకు డీఎంకే ప్రభుత్వం మంచి చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. నామక్కల్‌ జిల్లా బొమ్మకుట్టైలో ఆదివారం ఏర్పాటు చేసిన స్థానిక సంస్థ ప్రతినిధుల మహానాడులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. అతి చిన్న వయస్సులో తనకు తానుగా డీఎంకేకి అర్పించుకున్నట్టు గుర్తు చేశారు. అప్పుడు రాజకీయంలోకి ప్రవేశించిన తనకి తొలుత పదవులు, ప్రశంసలు లభించలేదన్నారు. జైలుశిక్ష, చిత్ర హింసలకు గురైనట్టు పేర్కొన్నారు. మిసా సమయంలో రాజకీయం వద్దని కొందరు రాసిచ్చినపుడు తాను ఒప్పుకోకుండా ప్రజలకు సేవలు చేయడానికి రాజకీయంలోకి వచ్చానని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయడంతో తనకు ఆహ్వానం పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడమే తన లక్ష్యమన్నారు. ఏడాది కాలంలో వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు పరిచినట్టు స్టాలిన్‌ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా ప్రజా సేవకు అవకాశం దక్కిందని తెలిపారు. మహిళలు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందడం సాధారణ విషయం కాదన్నారు. స్థానిక సంస్థలే ప్రజల జీవనాడి అని, తాను కూడా ఆ స్థాయి బాధ్యతలు నిర్వర్తించానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. పెరియార్‌, అన్నాదురై, కరుణానిధి తరహాలో స్థానిక సంస్థల ప్రతినిధులు సేవలందించాలని కోరారు. ఒక సంతకం పెనుమార్పు సృష్టిస్తుందని పేర్కొన్నారు. నామక్కల్‌ జిల్లా అన్ని వనరులతో కూడుకున్నదని తెలిపారు. విద్యలో కూడా మేటి అని కూడా గుర్తుచేశారు. ప్రస్తుతం నామక్కల్‌ డీఎంకే కోటగా మారిందని స్టాలిన్‌ పేర్కొన్నారు.

వేదికపై ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు దురైమురుగన్‌,

మా.సుబ్రమణియన్‌, కేఎన్‌ నెహ్రూ తదితరులు

కార్యక్రమానికి హాజరైన స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని