logo

అత్తిక్కడవు-అవినాశి పథకం పూర్తయేదెన్నడు?

అత్తిక్కడవు-అవినాశి పథకపు పనులు ఎప్పుడు పూర్తవుతాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం ఆయన  ఈరోడ్‌ జిల్లా పెరుందురైలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.

Published : 10 Aug 2022 00:38 IST

ప్రభుత్వాన్ని నిలదీసిన ఎడప్పాడి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: అత్తిక్కడవు-అవినాశి పథకపు పనులు ఎప్పుడు పూర్తవుతాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం ఆయన  ఈరోడ్‌ జిల్లా పెరుందురైలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఆరు నెలల క్రితమే పూర్తికావాల్సిన ఈ పథకం ఇంకా నాన్చుడు ధోరణితో అలాగే ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో నేరవేర్చలేని హామీలను ఇచ్చి ప్రజలను డీఎంకే నేతలు మభ్యపెట్టారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని పెదవి విరిచారు. గృహిణులకు నెలకు రూ.1,000 నగదు అందజేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే లేదని పేర్కొన్నారు. గ్యాస్‌ ధర తగ్గిస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ఎప్పుడో పూర్తికావాల్సిన అత్తిక్కడవు-అవినాశి పథకాన్ని కావాలనే డీఎంకే ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. పెరుందురై నియోజకవర్గపు దాహాన్ని తీర్చే కొడవేరి ఉమ్మడి తాగునీటి పథకాన్ని కూడా పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు.

ఘనస్వాగతం
విల్లివాక్కం, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ఎంపికైన తర్వాత మొదటి సారిగా మంగళవారం ధర్మపురి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. పలుప్రాంతాల నుంచి కార్యకర్తలు  తరలి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వందలాది వాహనాలు బారులు దీరాయి. రద్దీ కారణంగా ఎడప్పాడి వ్యాను నుంచి దిగకుండా ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ముందు టాపుపైకి ఎక్కి ప్రసంగించారు. ప్రసంగం పూర్తయ్యేంత వరకు అంబులెన్స్‌, ప్రభుత్వ టౌన్‌ బస్సులతో బాటు అన్ని వాహనాలు ఆసుపత్రి సమీపంలోని ధర్మపురి-సేలం రోడ్డులో నిలిచిపోయాయి. ధర్మపురి డీఎస్పీ వినోద్‌ రంగంలోకి దిగి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించడంతో అవి కదిలాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని