logo

గ్యాస్‌ టర్బైన్‌ స్టేషన్ల ఏర్పాటుపై టాన్‌జెడ్కో దృష్టి

ఉత్తర చెన్నైలో ‘గ్యాస్‌ టర్బైన్‌ స్టేషన్లు’ ఏర్పాటు చేసేందుకు ‘టాన్‌జెడ్కో’ సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు చేసేందుకు దృష్టి సారించింది.

Published : 05 Feb 2023 00:58 IST

ఐఓసీ ఎల్‌ఎన్‌జీ ట్యాంకు

వడపళని, న్యూస్‌టుడే: ఉత్తర చెన్నైలో ‘గ్యాస్‌ టర్బైన్‌ స్టేషన్లు’ ఏర్పాటు చేసేందుకు ‘టాన్‌జెడ్కో’ సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు చేసేందుకు దృష్టి సారించింది. అధ్యయనాలు పూర్తయిన తర్వాత 2,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనుంది. గ్యాస్‌ టర్బైన్‌ స్టేషన్ల ద్వారా ‘నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌’కి ఎన్నూరు నుంచి తూత్తుకుడి వరకు కావలసిన మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అందుకోసమే ప్రతిపాదనలు కూడా పంపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యుత్తు శాఖ మంత్రి వి.సెంథిల్‌బాలాజీ టర్బైన్‌ స్టేషన్ల ఏర్పాటు గురించి ప్రకటించారు. ఆ మేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. టాన్‌జెడ్కో సీనియర్‌ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం గ్యాస్‌ ధర బాగా ఉందని, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్‌ల ద్వారా విద్యుత్తు వినియోగించుకోవాలన్నదే తమ ప్రతిపాదన అని అన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ సంస్థకు ఎన్నూరులోని పాత థర్మల్‌ స్టేషన్ల ప్రాంతంలో ఖాళీ స్థలం ఉంది. అక్కడ ప్లాంటు ఏర్పాటుపై టాన్‌జెడ్కో దృష్టి సారించింది. గ్యాస్‌ ఇంజిన్‌ పవర్‌ ప్లాంటులో 18 - 20 మెగావాట్లతో ప్రారంభించి 2,000 మెగావాట్ల సామర్థ్యం వరకు పెంచేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయని సీనియర్‌ అధికారి ఒకరన్నారు. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు కన్సల్టంట్‌ సంస్థను కూడా టాన్‌జెడ్కో నియమించింది బేసిన్‌ బ్రిడ్జి వద్ద 120 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన గ్యాస్‌ టర్బైన్‌ స్టేషను ఉంది. దీన్ని లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ)గా మార్చేందుకు ఆలోచనలు జరుగుతున్నాయి. తద్వారా తక్కువ ఖర్చుతో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే వీలుంది. బేసిన్‌ బ్రిడ్జి స్టేషనులో 30 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన నాలుగు గ్యాస్‌ టర్బైన్‌ స్టేషన్లున్నాయని, ముందుగా నాఫ్తాతో విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే వీలుంది. యూనిట్‌కు రూ. 20 కంటే ఎక్కువ కావడం, నాఫ్తాకు అయ్యే ఖర్చు కూడా పెరగడంతో  2018 నుంచి గ్యాస్‌ స్టేషన్లు మూసివేసినట్టు టాన్‌జెడ్కో సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. పవర్‌ ప్లాంటులను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో బేసిన్‌ బ్రిడ్జి వద్ద సాధ్యాసాధ్యాలపై కూడా అధ్యయనం చేపట్టనున్నారు.

ధరలు పెరగటంతో...

* నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు గ్యాస్‌ ఉత్పత్తి సంస్థలు ధరలు పెరగటంతో గ్యాస్‌ డ్రైవన్‌లుగా మారాయి. భారత్‌లో తయారైన గ్యాస్‌పైనే ఎన్‌టీపీసీ ఆధారపడి ఉంది. అయితే కావలసిన గ్యాస్‌ లేకపోవడంతో మూతపడ్డాయి. ప్రస్తుతం ‘కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌’ (సీఎన్జీ) ఇతర దేశాల నుంచి దిగుమతి సౌకర్యం కలిగి ఉండటంతో విద్యుత్తు ప్లాంటులు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్‌ వైపునకు మళ్లుతున్నాయి. యూరప్‌లో మరి కొద్ది నెలల్లో శీతాకాలం ప్రవేశించనున్నందున సీఎన్‌జీ ధర కూడా తగ్గే అవకాశాలున్నాయి. సీఎన్జీ సరఫరాపై టాన్‌జెడ్కో అధికారులతో ఇటీవల సమావేశం జరిగిందని ఇండియన్‌ ఆయిల్‌ పైప్‌లైన్‌ విభాగం పేర్కొంది. పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుగుతున్నాయని, శ్రీపెరుంబుదూరు సహా ఉన్న ఖాతాదారులకు కూడా భారీ మొత్తంతో ఉన్న ఆర్డరుకు తగినట్టు పంపిణీ చేస్తున్నారు. టాన్‌జెడ్కో కావలసిన మాదిరిగా పైపులైన్లు అమర్చి పంపిణీకి కావలసిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని