logo

Srirangam Temple: శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి

తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో ఆంధ్ర భక్తులపై దాడి జరిగింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 30మందికి పైగా అయ్యప్ప భక్తులు, కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు మంగళవారం ఉదయం స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్నారు.

Updated : 13 Dec 2023 09:20 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో (Srirangam temple) ఆంధ్ర భక్తులపై దాడి జరిగింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 30మందికి పైగా అయ్యప్ప భక్తులు, కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు మంగళవారం ఉదయం స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్నారు. వారిలో కొందరు వరుసలో నిల్చోకుండా మధ్యమధ్యన  దూరినట్లు సమాచారం. దీనిపై మిగిలిన భక్తులు ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అనంతరం గర్భగుడి ముందున్న గాయత్రి మండపంలో ఆంధ్రా భక్తులు నిల్చుని ఉండగా రద్దీ ఏర్పడింది. ఆలయ తాత్కాలిక సిబ్బంది సర్ది చెబుతుండగా ఆంధ్రా భక్తులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రాకు చెందిన చెన్నారావు అనే భక్తుడిని ముక్కు పగిలేలా  సిబ్బంది కొట్టడంతో గాయమైంది. ఆయన అక్కడే కూర్చొని ధర్నా చేశారు. మిగిలిన భక్తులు పెద్దగా కేకలు వేశారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న నగర సహాయ పోలీసు కమిషనర్‌ నివేదలక్ష్మి, ఇన్‌స్పెక్టర్‌ అరంగునాథన్‌ ఆందోళన చేస్తున్న భక్తులను వెంట తీసుకెళ్లారు. ఆలయం సిబ్బంది భరత్‌ సహా ముగ్గురిపై శ్రీరంగం ఆలయ పోలీసుస్టేషన్‌లో భక్తులు ఫిర్యాదు చేశారు. ఆలయ సిబ్బంది కూడా భక్తులపై ఫిర్యాదు చేశారు. ఆలయంలో భక్తుల రక్తం చిందడంతో కాసేపు తలుపులు మూసేసి పరిహార పూజ చేసిన తర్వాత అనుమతించారు.

ఖండించిన భాజపా

అయ్యప్ప భక్తులపై దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. తన ఎక్స్‌ పేజీలో... అయ్యప్పమాలధారులు శబరిమలై నుంచి తిరిగొచ్చి రంగనాథుడిని దర్శించుకునేందుకు చాలాసేపు నిరీక్షించిన తర్వాత ఆలస్యంపై ప్రశ్నించారు. గొడవ జరిగి రక్తమయంగా మారింది. డీఎంకే ప్రభుత్వానికి హిందూధర్మంపై నమ్మకం లేదు. ఆలయ పవిత్రతను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుచ్చి జిల్లా పార్టీ యూనిట్ నిరసనకు దిగనుందని తెలిపారు.

వడపళని: ఆంధ్ర భక్తులపై దాడిని మాజీ ఎమ్మెల్సీ, భాజపా జాతీయ సహ ఇంఛార్జి పొంగులేటి సుధాకర్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం హిందూ ధర్మానికి, సనాతనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం, దేవాదాయశాఖ క్షమాపణ చెప్పాలని, నిందితులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని