logo

తిరువణ్ణామలైలో విజయ పతాకమెవరిది?

తిరువణ్ణామలై ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇక్కడి ఉన్నాములై సమేత అరుణాచలేశ్వర్‌ ఆలయంలో ఉంది. ఆలయం సుమారు 1100 ఏళ్ల కిందట నిర్మితమైంది.

Published : 28 Mar 2024 00:22 IST

అరుణాచలేశ్వరస్వామి ఆలయం

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇక్కడి ఉన్నాములై సమేత అరుణాచలేశ్వర్‌ ఆలయంలో ఉంది. ఆలయం సుమారు 1100 ఏళ్ల కిందట నిర్మితమైంది. 217 అడుగుల ఎత్తైన రాజగోపురం ఆకట్టుకుంటోంది. పడవేడు గ్రామంలో రేణుకాంబాళ ఆలయం, తెన్నాగూర్‌లో పాండురంగన్‌ ఆలయం, దేవికాపురంలో పెరియనాయకి ఆలయం, ఏరికుప్పంలో శనీశ్వరుని ఆలయం, చైయ్యారులో వేదపురీశ్వరర్‌ ఆలయం ప్రసిద్ధి చెందినవి. సాత్తనూర్‌ డ్యామ్‌ విహారయాత్ర స్థలంగా ఉంది. 1956లో తెన్‌పెన్నై నదిలో డ్యామ్‌ నిర్మించారు. తిరువణ్ణామలైలో ప్రసిద్ధి చెందిన రమణ మహర్షి ఆశ్రమం ఉంది.

సి.ఎన్‌.అన్నాదురై, ఎంపీ

వందవాసి నుంచి విడిపోయి..

తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. అంతకుముందు వందవాసి పార్లమెంటు నియోజకవర్గంలో ఉండేది. తిరువణ్ణామలై నియోజకవర్గంలో జోలార్‌పేట, తిరుప్పత్తూరు, చెంగం(రిజర్వు), తిరువణ్ణామలై, కీళ్‌పెన్నాత్తూర్‌, కలసపాక్కం శాసనసభ స్థానాలు ఉన్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు చెందిన వేణుగోపాల్‌, 2014 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు చెందిన వనరోజా, 2019లో డీఎంకే నుంచి పోటీ చేసిన సీఎన్‌ అన్నాదురై గెలుపొందారు. ఆయన ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు చెందిన అగ్రి కృష్ణమూర్తిని 3,04,187 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుతం ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా సీఎన్‌ అన్నాదురైని అభ్యర్థిగా ప్రకటించారు. అన్నాదురై పార్లమెంటులో అత్యధిక ప్రశ్నలు సంధించిన రాష్ట్ర రెండో ఎంపీగా గుర్తింపు పొందారు. దక్షిణ భారతంలో 3వేలమందికి పైగా ప్రత్యేక ప్రతిభావంతులకు వైద్య ఉపకరణాలు అందేలా ఏర్పాట్లు చేశారు. తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణ బాటలో టైల్స్‌ ఏర్పాటు చేయించారు. రైల్వే వంతెన అందుబాటులోకి తెచ్చారు. తిరువణ్ణామలై బస్టాండు నుంచి రైల్వేస్టేషన్‌ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. 41 ఏళ్ల అన్నాదురై ముదలియార్‌ సామాజికవర్గానికి చెందినవారు. డీఎంకే యువజన విభాగ స్థాపకుడుగా ఉన్న ఆయన బీకాం వరకు చదువుకున్నారు. ప్రస్తుతం రెడీమిక్స్‌ కాంక్రీట్‌ తయారు చేసే సంస్థ నడుపుతున్నారు. నియోజకవర్గంలో ముదలియార్లు, వన్నియర్లు, యాదవులు, దళితులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. తిరువణ్ణామలై పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కాలువల్లో పూడిక తీయాలని రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ఆలయంలో కనీస వసతులు సరిగా లేవని, కార్‌ పార్కింగ్‌ కల్పించాలని భక్తులు కోరుతున్నారు. పలు రోడ్లలో ఆక్రమణలు తొలగించాలని ప్రజలు విన్నవిస్తున్నారు. అన్నాడీఎంకే తరఫున కళియ పెరుమాళ్‌ బరిలో ఉన్నారు.

నియోజకవర్గ మ్యాప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని