AP News: చేయి చేయి కలిపి.. తుది శ్వాస విడిచిన దంపతులు
విశాఖపట్నం, న్యూస్‌టుడే : అప్పటివరకు బంధువులతో కలిసి సంతోషంగా గడిపిన భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరగా... ట్యాంకర్ లారీ వారి పాలిట మృత్యుపాశంగా మారింది. బుధవారం ఎన్ఏడీ దరి కాకానినగర్ కూడలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులిద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు తాపత్రయం పడిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
ఎయిర్ పోర్టు పోలీసులు, స్థానికుల వివరాల మేరకు... ప్రకాశం జిల్లా వేటపాలెం ప్రాంతానికి చెందిన నున్న వెంకట నాగేశ్వరరావు(48), నున్న రమాదేవి (40) గత కొన్నేళ్లుగా గాజువాక చినగంట్యాడలోని జగ్గుజంక్షన్లో నివాసం ఉంటున్నారు. నాగేశ్వరరావు గాజువాక శ్రీ చైతన్య కళాశాలలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. బుధవారం తమ బంధువుల అమ్మాయికి విమానాశ్రయంలో వీడ్కోలు పలికి, అనంతరం మర్రిపాలెంలో తమ బాబాయ్ మోహన్ నూతనంగా కొనుగోలు చేసిన ఇంటిని చూసేందుకు భార్యతో కలిసి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తుండగా కాకానినగర్ కూడలిలో రోడ్డుపై ఉన్న స్టాపర్‌ను తప్పించేందుకు వాహన వేగాన్ని తగ్గించారు. ఇంతలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ట్యాంకర్ లారీ వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోవడంతో ట్యాంకర్ లారీ చక్రాలు వారి పైనుంచి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన వెంకట నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కంచరపాలెం ట్రాఫిక్ సీఐ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎయిర్‌పోర్టు సీఐ సీహెచ్.ఉమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* నాగేశ్వరరావు, రమాదేవి దంపతుల కుమారుడు విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి ఏడాది చదువుతున్నాడు. రమాదేవి తల్లిదండ్రులు ఇటీవలే కొవిడ్ బారిన పడి మృతి చెందారు. వరుస ఘటనలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Advertisement