logo

జిల్లాకో విమానాశ్రయం విడ్డూరం

‘అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుని మంత్రులు విమర్శిస్తుంటే రెండు చేతులు కట్టుకుని సీఎం జగన్‌ నవ్వుకుంటుంటారు. తమని మోసగించారన్న బాధతో ఉద్యమిస్తున్న 13 లక్షల మంది ఉపాధ్యాయులను.....

Published : 23 Jan 2022 04:22 IST


అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: ‘అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుని మంత్రులు విమర్శిస్తుంటే రెండు చేతులు కట్టుకుని సీఎం జగన్‌ నవ్వుకుంటుంటారు. తమని మోసగించారన్న బాధతో ఉద్యమిస్తున్న 13 లక్షల మంది ఉపాధ్యాయులను చూసి జగన్‌ ఆనందిస్తున్నారు. ఆయన్ను చూస్తుంటే శాడిస్టులా కనిపిస్తున్నారు.. విశాఖపట్నంలోనో, హైదరాబాదులోనో చూపించా’లని కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. నర్సీపట్నం విలేకరులకు శనివారం పంపిన వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. ‘ఆంధ్రాకు అప్పు పుట్టే పరిస్థితి లేదు. అప్పు కోసం ఆర్థిక మంత్రి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితిలో జిల్లాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించడం విడ్డూరంగా ఉంద’ని ఎద్దేవా చేశారు. ‘ఖజానాలో డబ్బులు లేకపోయినా.. గత ఏడాది మే నెలలో రూ.7880 కోట్ల అంచనాతో 16 వైద్య కళాశాలల నిర్మాణానికి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పునాదులే పూర్తి కాలేదు. సగంలో వదిలేస్తే తర్వాత అధికారంలోకి వచ్చే చంద్రబాబు వాటిని పూర్తి చేయాలా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆధారం సుజల స్రవంతి ప్రాజెక్టు. ఈ రెండు పూర్తిచేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. జగన్‌ అధికారం చేపట్టి 33 నెలలైంది. ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో ఆయనకే తెలియద’న్నారు. విజయనగరం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించింది. దానికి ఇప్పటికీ స్థలం సమకూర్చలేకపోయారని అయ్యన్న విమర్శించారు. ‘కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం ఇంకా అందజేయలేదు. కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వాహకులకు విశాఖ జిల్లాలోనే రూ.25 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నీరు-చెట్టు, ఉపాది ఫహామీ పథకం పనులు, టిడ్కో ఇళ్లు నిర్మించిన గుత్తేదార్లకు బిల్లులు ఇవ్వలేదు. రైతుల నుంచి ధాన్యం కొనే దిక్కులేదు. ఇలాంటి స్థితిలో విమానాశ్రయాలు కడతామంటే జనం నవ్వుకుంటున్నా’రని అయ్యన్న పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంపద సృష్టించడం తెలియదని ఆయన విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని