logo

‘ఉక్కు’ చక్రాలు వద్దంట!!

విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్మించిన రైలు చక్రాల(ఫోర్జ్‌డ్‌ వీల్స్‌) తయారీ కేంద్రం రైల్వేశాఖకు అనుగుణమైన ఉత్పత్తులు తయారు చేయలేని స్థితిలో ఉందనే అంశం  చర్చనీయాంశంగా మారింది.

Updated : 22 May 2022 05:24 IST

భారీ ఆర్డర్‌ కోల్పోయిన కర్మాగారంఅవకాశాన్ని దక్కించుకున్న చైనా కంపెనీ

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్మించిన రైలు చక్రాల(ఫోర్జ్‌డ్‌ వీల్స్‌) తయారీ కేంద్రం రైల్వేశాఖకు అనుగుణమైన ఉత్పత్తులు తయారు చేయలేని స్థితిలో ఉందనే అంశం  చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.1600 కోట్లు వెచ్చించి నిర్మించిన కర్మాగారాన్ని గత సంవత్సరం ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఇక్కడ సంవత్సరానికి లక్ష చక్రాలు తయారు చేయవచ్చు. వివిధ కారణాలతో ఆ విభాగాన్ని రాయ్‌బరేలీలో ఏర్పాటు చేయడంతో... అక్కడ ఏం జరుగుతుందన్న విషయం స్థానిక ఉక్కు కర్మాగార అధికారులకు, యూనియన్‌ నాయకులకు కూడా పూర్తిగా తెలియటం లేదని సమాచారం.

* రైల్వేశాఖ కొన్ని రకాల రైలు చక్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. వాటిని భారతదేశంలోనే తయారుచేసేలా చర్యలు తీసుకుంటే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, కొనుగోలు వ్యయం కూడా తగ్గుతుందని అంచనా వేశారు. అటు రైల్వేలకు, ఇటు ఉక్కు కర్మాగారానికి ఉభయతారకంగా ఉండే ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎందుకు పనిచేయడంలేదన్నది మిస్టరీగా మారింది.

అవకాశం చేజారే...: రైల్వేశాఖ ఇటీవల భారీఎత్తున ఆధునికీకరణ ప్రక్రియ చేపట్టింది. అత్యాధునిక పరిజ్ఞానాలతో ఎల్‌హెచ్‌బీ బోగీలను, వందేభారత్‌ రైళ్ల బోగీలను నిర్మిస్తోంది. వాటికి అవసరమైన చక్రాలను ఉక్కు కర్మాగారం తయారు చేస్తే  ప్రయోజనకరంగా ఉండేది. నేటికీ ఆయా అధునాతన రైళ్లకు అవసరమైన చక్రాలను తయారు చేయడంలేదని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. పాత రైలు బోగీలకు అవసరమైన చక్రాలనే ప్రస్తుతానికి తయారు చేస్తుండడంతో తాజా అవకాశాల్ని ఉక్కు కర్మాగారం అందిపుచ్చుకోలేని పరిస్థితిలో పడినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అందుకే రైల్వేశాఖ ఏకంగా రూ.170 కోట్ల ఆర్డర్‌ను ఇటీవలే చైనా కంపెనీకి ఇచ్చినట్లు కర్మాగార వర్గాలు పేర్కొంటున్నాయి.

పునఃప్రారంభంకాని బ్లాస్ట్‌ఫర్నేస్‌: విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఒక బ్లాస్ట్‌ఫర్నేస్‌లో ఉక్కు ఉత్పత్తిని నిలిపేశారు. బొగ్గు నిల్వలు లేని కారణంగా రెండు బ్లాస్ట్‌ఫర్నేస్‌లలోనే ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. అందరూ మూడో ఫర్నేస్‌ను కూడా తెరుస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో ఉత్పత్తిని మరింత తగ్గించడానికి వీలుగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారనే ప్రచారం తాజాగా వెలుగులోకి రావడం సంస్థ ఉద్యోగులను, కార్మికులను కలవర పరుస్తోంది. ఆయా విషయాలను ఉక్కు యూనియన్‌ నాయకులు పేర్కొంటున్నారుగానీ సంస్థ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ అంశాలపై వివరణ కోరేందుకు ‘ఈనాడు’ ప్రతినిధి ఉక్కు అధికారులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని