logo

జెండా పండక్కి అమృత్‌ సరోవర్‌

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘మిషన్‌ అమృత్‌ సరోవర్‌’ పేరిట చేపట్టిన కొత్త చెరువుల నిర్మాణం, పాత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం క్రమేణా కొలిక్కి వస్తోంది. అనకాపల్లి జిల్లాలో పునరుద్ధరించిన 17 చెరువుల వద్ద ఆగస్టు 15వ తేదీన జాతీయ పతాకాన్ని

Published : 09 Aug 2022 05:46 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే

పునరుద్ధరణ పనుల అనంతరం నాతవరం చీడిపల్లి కొండయ్య చెరువు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ‘మిషన్‌ అమృత్‌ సరోవర్‌’ పేరిట చేపట్టిన కొత్త చెరువుల నిర్మాణం, పాత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం క్రమేణా కొలిక్కి వస్తోంది. అనకాపల్లి జిల్లాలో పునరుద్ధరించిన 17 చెరువుల వద్ద ఆగస్టు 15వ తేదీన జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

* నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన చెరువుల్లో పనులు తొలుత పూర్తి చేయిస్తున్నారు. కొన్ని చోట్ల వర్షపు నీరు చేరడంతో పనులు చేపట్టేందుకు వీలుకాలేదు. భూగర్భ జలాల పరిరక్షణకు ఈ చెరువుల ఎంతగానో ఉపయోగపడతాయి. కొత్త చెరువుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వీలుకాని పక్షంలో పాత చెరువులనే పునరుద్ధరించాలని మార్గదర్శకాలొచ్చాయి.

* నర్సీపట్నం నియోజకవర్గంతోపాటు పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని కోటవురట్ల, చోడవరం నియోజకవర్గ పరిధిలోని రోలుగుంట మండలాల్లో కొత్త చెరువుల ఏర్పాటుకు అవకాశాలు లేకపోవడంతో పాత వాటినే పునరుద్ధరిస్తున్నారు.

* ఈ నెల 11న తిరంగ్‌ మార్చ్‌ (జెండాతో చెరువు చుట్టూ తిరగడం) నిర్వహించనున్నారు. 14వ తేదీ సాయంత్రం చెరువుకు హారతి ఇవ్వడం, దేశభక్తి గేయాల ఆలాపన, సమాజ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేళ జెండా వందనం చేస్తారు.

* అమృత్‌ సరోవర్‌ కింద జిల్లాలో 75 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో 17 చెరువులను జెండా పండక్కు సిద్ధం చేస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో నాతవరంలోని చీడిపల్లి కొండయ్య చెరువుని ఇప్పటికే సిద్ధం చేశారు. గట్టుపై కొబ్బరి, వేప, కానుగ మొక్కలను నాటించేందుకు కార్యాచరణ చేపట్టారు. మిగతాచోట్లా ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో దానికి విస్తీర్ణం బట్టి రూ.10 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

* నర్సీపట్నం మండలంలోని ధర్మసాగరంలో వంకబంద, బంగారయ్యపేటలోని పొట్టిబంద చెరువులను ఎంపిక చేసినా.. వీటిలోకి నీరు చేరడంతో పనులు చేపట్టలేదు. గొలుగొండ మండలం పాతమల్లంపేట పంచాయతీలోని రామచంద్రుడు చెరువులో రూ.9.94 లక్షలతో పూడికతీత పనులు చేపట్టారు.

జాతీయ పతాకం ఆవిష్కరించడానికి ఏర్పాట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని