logo

ఉపాధి ఉత్తమాటేనా..!

సెజ్‌ నిర్మాణానికి 430 ఎకరాల భూమిని తమ గ్రామస్థులు కోల్పోయారు. మా గ్రామం పరిధిలోనే ఏటీజీ టైర్ల కంపెనీ నిర్మాణం చేపట్టారు. సెజ్‌లో కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యాన్ని భరిస్తున్నాం.

Updated : 16 Aug 2022 07:00 IST

పరిశ్రమల్లో ప్రమాదాలపై కార్మికుల్లో ఆందోళన

సీఎం సారూ.. భరోసా ఇవ్వాలి మీరు..!


ఏటీజీ టైర్ల తయారీ పరిశ్రమ

సెజ్‌ నిర్మాణానికి 430 ఎకరాల భూమిని తమ గ్రామస్థులు కోల్పోయారు. మా గ్రామం పరిధిలోనే ఏటీజీ టైర్ల కంపెనీ నిర్మాణం చేపట్టారు. సెజ్‌లో కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యాన్ని భరిస్తున్నాం. గ్రామంలో బీటెక్‌, డిప్లమో, ఐటీఐ, డిగ్రీ చదువుకున్న 56 మంది యువకులకు ఉపాధి కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో ఈ కంపెనీ ప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదు. కనీసం హమాలి, హౌస్‌ కీపింగ్‌ పనులైనా ఇవ్వాలని కోరినా కనికరం చూపడం లేదు’..

...అధికార పార్టీకి చెందిన మార్టూరు సర్పంచి కేకేవీ సీతారామరాజు ఆవేదన

టైర్ల తయారీ పరిశ్రమలో ఉపాధి చూపించాలని కోరితే 24 ఏళ్లలోపు యువత ఉండాలంటున్నారు. ఆ వయసు యువకుల వివరాలు అందిస్తే చూద్దాం అంటున్నారు. మా భూముల్లో కంపెనీలు ఏర్పాటుచేసి మాకు ఉపాధి చూపకపోవడం ఏమిటి?, స్థానికులకు 75 శాతం ఉపాధిని కంపెనీ ప్రతినిధులు అమలుచేయడం లేదు. కేవలం ఏడుగురినే తీసుకున్నారు. మిగిలిన వారిని గేటు కూడా దాటనివ్వడం లేదు.

...వైకాపాకు చెందిన అచ్యుతాపురం వైస్‌ ఎంపీపీ అల్లంపల్లి లక్ష్మి పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ వద్ద చెప్పిన మాటలివి..

రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసినా స్థానికులకే 75శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ స్థానిక సెజ్‌లో అమలుకు నోచుకోవడం లేదు. పరిశ్రమలకు భూములిచ్చిన నిర్వాసితులతో పాటు స్థానికులకు ఉపాధి ఎండమావే అయింది. అచ్యుతాపురం సెజ్‌లో 90 ఎకరాల స్థలంలో కొత్తగా నిర్మాణ పనులు పూర్తిచేసుకున్న ఏటీజీ టైర్ల కంపెనీలో కూడా ఈ హామీ అమలు కాలేదు. ఈ కంపెనీ ద్వారా రెండు వేలమందికి ప్రత్యేకంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటికే 400 మంది వరకు ఉద్యోగులను నియమించుకున్నారు. వీరిలో 10 శాతం మంది కూడా నిర్వాసితులు లేకపోవడం విశేషం. మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పరిశ్రమ ప్రారంభిస్తున్నందున నిర్వాసితుల ఉపాధిపై సీఎం స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఫిషింగ్‌ హార్బర్‌ ఇంకెన్నాళ్లు.. : పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ కోసమంటూ స్థల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ చేసి 20 నెలలు గడుస్తున్నా పనుల్లో అంగుళం కదలిక లేదు. ఇక్కడ ఇటుకైనా వేయకుండానే ముఖ్యమంత్రి జగన్‌ నెల్లూరు పోర్టు ప్రారంభోత్సవ సభలో పూడిమడకలో హార్బర్‌ నిర్మాణం జరుగుతోందని చెప్పడాన్ని మత్స్యకారులు తప్పుపడుతున్నారు. ఇక్కడ హార్బర్‌ లేకపోవడంతో కాకినాడ, విశాఖపట్నం, తమిళనాడు, ఒడిశా, మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోవాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.  

స్థానికుడినని తొలగించారు...
కంపెనీ పునాదుల నుంచి పనిచేస్తున్నాను. బీ.కామ్‌ చదువుకున్నాను. నేను స్థానికుడినని తెలుసుకొని పనుల నుంచి తొలగించారు. ఉపాధి కోసం కంపెనీ ప్రతినిధులను ప్రాధేయపడినా కనికరం చూపలేదు. చిన్నచిన్న కాంట్రాక్టర్ల వద్ద పనిచేయడానికి స్థానికులకు అవకాశం ఇవ్వడం లేదు. హౌస్‌కీపింగ్‌ పనులకు సైతం ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకొచ్చి చేయించుకుంటున్నారు.

- రాజు, కంపెనీ సమీప గ్రామానికి చెందిన యువకుడు

ప్రమాదాలపై గోప్యతెందుకు..?
సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో రెండు వరస దుర్ఘటనల్లో విష వాయువు ఎక్కడ నుంచి విడుదలయిందో బయటపెట్టడం లేదు. వందల మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన ఉదంతంలో పీసీబీ అధికారులకు కారణాలు తెలిసినా నేతల జోక్యంతో బహిర్గతం చేయడం లేదని కార్మికులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప సర్కార్‌ సీరియస్‌గా తీసుకోవడంలేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సెజ్‌లో తొలిసారి అడుగుపెడుతున్న ముఖ్యమంత్రి జగన్‌ కార్మికుల భద్రతకు భరోసా ఇచ్చే ప్రకటన చేయాలని కోరుతున్నారు. 

పనులను వెంటనే ప్రారంభించాలి
ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం కోసం స్థానికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువమంది మత్స్యకారులు చేపలవేట సాగించే పూడిమడకలో హార్బర్‌ కోసం ఏడాదిన్నర క్రితమే అడుగులు పడినా అవి అక్కడితోనే ఆగిపోయాయి.  చేపలరేవు పనులు వెంటనే ప్రారంభించి స్థానికులను ఆదుకోవాలి.

-మేరుగు బాపునాయుడు, మత్స్యకార నాయకుడు, పూడిమడక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని