logo

ప్రయివేటు సంస్థపై.. ఎంత ప్రేమో?

మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు ప్రయివేటు ఏజెన్సీలపై అవ్యాజ్య ప్రేమను కనబరుస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులకు కలిసొచ్చేలా నిర్ణయాలు తీసుకుంటూ స్థాయీ సంఘ సమావేశాల్లో ప్రతిపాదనలు పెడుతున్నారు.

Published : 01 Dec 2022 05:14 IST

కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఆడిట్‌ బాధ్యతలు
ఏడాదిన్నరకు రూ.39.91 లక్షలతో ప్రతిపాదన
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

జీవీఎంసీ కార్యాలయం

హా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు ప్రయివేటు ఏజెన్సీలపై అవ్యాజ్య ప్రేమను కనబరుస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులకు కలిసొచ్చేలా నిర్ణయాలు తీసుకుంటూ స్థాయీ సంఘ సమావేశాల్లో ప్రతిపాదనలు పెడుతున్నారు. తాజాగా జీవీఎంసీ పొరుగుసేవల సిబ్బంది పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధుల నిర్వహణ, ఆడిట్‌ చేయడానికి ఏడాదిన్నరకు రూ.39.91 లక్షలు వెచ్చించడానికి సన్నద్ధమవుతున్నారు. దీనినీ స్థాయీ సంఘ అనుమతి నిమిత్తం ప్రతిపాదించారు.


తెరవెనుక మంత్రాంగం..

జీవీఎంసీలో మొత్తం 7,920 మంది పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. వారిలో 7,051 మంది ఆప్కోస్‌ (ఆంధ్రప్రదేశ్‌ పొరుగు సేవల సంస్థ)లో చేరగా, మరో 869 మందికి జీవీఎంసీ నేరుగా వేతనాలిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారిని ఇప్పటి వరకు ఆప్కోస్‌లో చేర్చలేదు. 010 పద్దు కింద 7,051 మంది కార్మికుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా వేతనాలు జమ చేస్తోంది.

* ఈ విధానం అమల్లోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ఇప్పటి వరకు జీవీఎంసీ కార్మికుల నుంచి పీఎఫ్‌, ఈఎస్‌ఐలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. అయినా ప్రయివేటు ఏజెన్సీకి ప్రయోజనం కలిగించడానికి తెరవెనుక కొందరు ప్రజాప్రతినిధులు మంత్రాంగం నడిపారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏజెన్సీ ద్వారా ఆడిట్‌ చేయించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

* వాస్తవంగా జీవీఎంసీ పొరుగుసేవల కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఆప్కోస్‌ సిబ్బందిని పంపిస్తోంది. వారు ఐదు రోజులపాటు నగరంలో ఉంటూ కార్మికులను సంప్రదించి సమస్యలు పరిష్కరిస్తున్నారు.


గతంలో తిరస్కరించి..

కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధుల నిర్వహణ, ఆడిట్‌ చేయడానికి ఒక ఏజెన్సీ సంస్థకు అనుమతి ఇవ్వాలని అధికారులు ఆరునెలల కిందట స్థాయీ సంఘం సమావేశం అజెండాలో చేర్చారు. నాడు స్థాయీ సంఘం సభ్యులంతా ఆ అంశాన్ని తిరస్కరించారు. అవసరం లేకపోయినా ఏజెన్సీలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ప్రశ్నించారు. దాదాపు ఆర్నెళ్లపాటు పక్కనపెట్టిన అంశాన్ని తాజాగా తిరిగి ప్రతిపాదించడం గమనార్హం. ఒక వేళ ఈ తరహా పనులు ప్రయివేటుకు అప్పగించాల్సి వస్తే, ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు ఆహ్వానించాలి.


ఎవరు తక్కువ నిధులతో సేవలందించడానికి ముందుకు వస్తే వారికే పని అప్పగించాలి. అయితే ఇక్కడ ఫలానా ఏజెన్సీకి పని అప్పగించాలని అధికారులు నేరుగా ప్రతిపాదనలు తయారు చేయడం గమనార్హం.


ప్రయివేటు ఏజెన్సీతో ఆర్థికభారం...
-ఎం.ఆనందరావు, గ్రేటర్‌విశాఖ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు

పొరుగుసేవల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వేతనాలు మంజూరు చేస్తోంది. అక్కడే పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధులు మినహాయిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా సిబ్బందిని పంపించి పీఎఫ్‌, ఈఎస్‌ఐల్లో సమస్యలుంటే పరిష్కరిస్తోంది. ఆయా పనుల నిర్వహణకు ప్రయివేటు ఏజెన్సీ ఏర్పాటు వల్ల ఆర్థికభారం తప్ప ఇతర ప్రయోజనాలు ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని