logo

Vizag Steel: విశాఖ ఉక్కు కోసం ముందుండి పోరాడుతాం: మంత్రి అమర్‌నాథ్‌

‘విశాఖ ఉక్కు.. కేంద్రం హక్కు కాదు.. తెలుగువారి హక్కు’ అని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

Published : 30 Jan 2023 23:50 IST

విశాఖపట్నం: ‘విశాఖ ఉక్కు.. కేంద్రం హక్కు కాదు.. తెలుగువారి హక్కు’ అని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మైదానంలో ఉక్కు ప్రజా గర్జన సభకు ఆయన హాజరయ్యారు. అమర్‌నాథ్‌తో పాటు వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాస్‌తో పాటు సీపీఐ, సీపీఎం, జనసేన నేతలు హాజరయ్యారు.

అనంతరం మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ..‘‘సముద్రం పక్కనున్న ఏకైక స్టీల్‌ప్లాంట్‌.. విశాఖ ఉక్కు పరిశ్రమ. 1960లో మొదలైన ఉక్కు ఉద్యమం 2023 నాటికీ ఆగలేదు. ఉక్కు ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. విశాఖ ఉక్కు కోసం ముందుండి పోరాటం చేస్తాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేశాం. ఉక్కు పరిశ్రమ కోసం పార్టీలన్నీ కలిసి పోరాటం చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలు చూస్తూ ఊరుకోబోం’’ అన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘విశాఖ ఉక్కు వ్యాపార సంస్థ కాదు. 32 మంది బలిదానం.. 64 గ్రామాల ప్రజల త్యాగంతో వచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వైకాపా పూర్తిగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కును కాపాడేందుకు మేం అండగా నిలుస్తాం. కొన్ని పార్టీలు లోపల ఒకటి.. బయటకు మరొకటి చెబుతున్నాయి. ఒకసారి మాట ఇచ్చాక మేం వెనకడుగు వేసేది లేదు’’ అని సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని