logo

‘నాడు.. నేడు’..పడని అడుగు!

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌ కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌)తో పాటు వీజీహెచ్‌ (ఘోషాసుపత్రి), విమ్స్‌ (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ)లో ప్రతిపాదిత ‘నాడు-నేడు’ పథకం పనుల్లో కదలిక లేదు.

Updated : 09 Feb 2023 06:15 IST

రెండేళ్లయినా విడుదలవని నిధులు

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌ కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌)తో పాటు వీజీహెచ్‌ (ఘోషాసుపత్రి), విమ్స్‌ (విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ)లో ప్రతిపాదిత ‘నాడు-నేడు’ పథకం పనుల్లో కదలిక లేదు.

ప్రసూతి విభాగం

రెండేళ్ల క్రితం రూ.950 కోట్లతో ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా టెండర్లు ఖరారు చేశారు. గుత్తేదారుని ఎంపిక కూడా పూర్తయింది. అయితే నిధులు లభ్యత లేకపోవడంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వివిధ బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించాలని ప్రభుత్వ వర్గాలు భావించినా సాధ్య పడలేదు. దీని ప్రభావం కేజీహెచ్‌, వీజీహెచ్‌లపై గణనీయంగా చూపుతోంది.

అధ్వానంగా భవనాల నిర్వహణ: ప్రతిపాదిత నిధుల్లో కేజీహెచ్‌కు రూ.600 కోట్ల వరకు కేటాయించారు. ఈ నిధులతో ఏడేసి అంతస్తుల చొప్పున నాలుగు బహుళ అంతస్తుల భవనాలు, ఎ.ఎం.సి.(ఆంధ్రవైద్య కళాశాల) పరిధిలో ఒక భవనం, పీజీ, యూజీ వైద్యవిద్యార్థుల కోసం రెండు వసతి గృహాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ‘నాడు-నేడు’ అమలవుతుందని చెబుతూ రెండేళ్ల నుంచి కొన్ని భవనాల నిర్వహణను గాలికి వదిలేశారు.

* కేజీహెచ్‌ ఆవరణలోని ప్రసూతి విభాగం, కార్డియాలజీ, ఎముకలు, సర్జికల్‌ విభాగాలతో పాటు ఓపీ బ్లాకు, ఎ.ఎం.సి. పరిధిలోని పరిపాలన బ్లాక్‌, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ తదితర విభాగాలను ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఆయా భవనాలు 60-70ఏళ్ల క్రితం నిర్మించారు. వాటి నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ తరుణంలో ‘నాడు-నేడు’ పథకం ఆశాకిరణంలా కనిపించింది. తీరా ఊరించి.. ఉసూరుమనిపించడంతో ప్రస్తుతం భవనాల నిర్వహణ దారుణంగా ఉంది. వర్షం పడితే కేజీహెచ్‌ కార్డియాలజీ బ్లాక్‌ కారిపోతోంది.

అలా...పనులు ప్రారంభం : ఏఎంసీలో పీజీ సీట్ల పెంపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు పీజీ వసతిగృహాలను మంజూరు చేసింది. 600 మంది విద్యార్థులు ఉండేలా ఎ.ఎం.సి. ఆవరణలో ఒకటి, పందిమెట్ట ప్రాంతంలోని పురుషుల వసతిగృహం ఆవరణలో మరొకటి నిర్మించడానికి ప్రతిపాదించారు. వాటితోపాటు వైద్య పరికరాల కొనుగోలుకు రూ.150 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధుల్లో 60శాతం కేంద్రం, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కేంద్రం వాటాగా రూ.25 కోట్లు మంజూరు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికీ గత నెల 6న రెండు వసతిగృహాల నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శంకుస్థాపన చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు