logo

Vizag: ‘డబ్బా’కొట్టిన వంతెన ఇంతేనా!!

ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని వైకాపా ప్రభుత్వ మంత్రులు, నేతలు దాదాపు 10 రోజుల క్రితం ప్రారంభించినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.

Updated : 07 Mar 2024 08:06 IST

డబ్బాలను పరిశీలిస్తున్న సిబ్బంది

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పెదవాల్తేరు : ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని వైకాపా ప్రభుత్వ మంత్రులు, నేతలు దాదాపు 10 రోజుల క్రితం ప్రారంభించినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. పర్యాటకులను ఆకట్టుకునే ప్రాజెక్ట్‌ ఇదే అనేలా నాడు ఎంతో హడావుడి చేశారు. తేలియాడే వంతెన డబ్బాలు అలల తాకిడికి ధ్వంసమవుతున్నాయి. ఎగసిపడుతున్న అలలకు లింకులు తెగిపోతున్నాయి. కొన్నయితే విరిగిపోతున్నాయి. టీ జాయింట్‌ డబ్బాలు విడిపోతున్నా.. పలుమార్లు సరిచేస్తున్నా మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. సముద్రంలో కొంత దూరం వరకూ ఉన్న వంతెనను బయటకు తీసి అందులోని కొన్ని భాగాలను విడదీశారు. పాడైన వాటి స్థానంలో కొత్తవి అమర్చే ప్రక్రియ సాగిస్తున్నారు. వంతెనకు సమీపంలో బ్యానరు ఏర్పాటు చేసి సందర్శకులు దూరంగా ఉండాలని సూచించారు. సాగరంలో రెండుగా విడిపోయిన ‘వ్యూపాయింట్‌’ను సరిచేసే పనులు చేపట్టారు. పాడైన డబ్బాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేలా కొన్నింటిని కంటైనర్‌ వద్ద అందుబాటులో ఉంచారు.

వంతెనకు దూరంగా సాగరంలో టీ జాయింట్‌

గత నెల 25న సందడి వాతావరణంలో ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఒక్క రోజులోనే తెగిపోయింది. అధికారులు మాక్‌ డ్రిల్‌ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మళ్లీ అలల తీవ్రతకు అది తెగిపోయింది. అప్పటి నుంచి సముద్రం లోపల వంతెనకు దూరంగానే ఉండిపోయింది. పలుమార్లు సరిచేస్తున్నా వ్యూపాయింట్‌ ఊడిపోతూనే ఉంది. తాజాగా కొత్త డబ్బాలు తీసుకురాగా అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని