logo

Vizag: రాళ్ల గుట్టల మధ్య మిస్టరీ!!

విశాఖ నగరంలో కాలిన స్థితిలోని ఓ మృతదేహం ఆదివారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండాడ- రుషికొండ మార్గంలో ఏపీ హౌసింగ్‌బోర్డు స్థలాలున్న రోడ్డులో రాళ్ల గుట్టల మధ్య దీన్ని గుర్తించి స్థానికులు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు.

Updated : 11 Mar 2024 07:53 IST

కాలిన స్థితిలో మృతదేహం
హత్యా..? ఆత్మహత్యా..? అనే అంశంపై దర్యాప్తు
మృతుడు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వాసి

మోసుగంటి సుబ్రహ్మణ్యం (పాతచిత్రం)

పీఎంపాలెం, ఎండాడ, న్యూస్‌టుడే: విశాఖ నగరంలో కాలిన స్థితిలోని ఓ మృతదేహం ఆదివారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండాడ- రుషికొండ మార్గంలో ఏపీ హౌసింగ్‌బోర్డు స్థలాలున్న రోడ్డులో రాళ్ల గుట్టల మధ్య దీన్ని గుర్తించి స్థానికులు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని ఆరా తీశారు. ఈ ఘటనపై నార్త్‌జోన్‌ ఏసీపీ రాంబాబు తెలిపిన వివరాలిలా... మృతదేహం ఉన్న చోట కారులో లభ్యమైన వివరాల ఆధారంగా మృతుడు సుబ్రహ్మణ్యం అలియాస్‌ జాన్‌గా గుర్తించి బంధువులకు తెలియజేశారు. నగర పరిధిలోని ఆరిలోవలోనే ఉంటున్న మృతుడి అన్నయ్య పాస్టర్‌ ప్రకాష్‌ రావడంతో పోలీసులు ఇతర వివరాలు తెలుసుకున్నారు.

ట్యాక్సీ బోర్డుతో ఉన్న మృతుడి కారు

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు సమీప జగ్గన్నపేట గ్రామానికి చెందిన మోసుగంటి సుబ్రహ్మణ్యం(43) అలియాస్‌ జాన్‌ ఎంవీపీ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్నారు. 13 ఏళ్ల క్రితం వివాహం జరిగినా భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వీరి కుమారుడు ప్రస్తుతం తల్లితో ఉంటున్నాడు. పెళ్లయ్యాక  సుబ్రహ్మణ్యం దుబాయ్‌ వెళ్లి నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చారు. ప్రస్తుతం సొంతంగా కారు నడుపుతూ జీవిస్తున్నారు. కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అతడి చరవాణి వాట్సప్‌ స్టేటస్‌లో శనివారం అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల మధ్య మనశ్శాంతి లేని వారికి శాంతి చేకూరాలంటే యెహోవా సన్నిధి అవసరమనేలా రెండు స్లోగన్లు; అలాగే ఈనెల 8వ తేదీన చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యాయత్న చిత్రాలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఇది ఆత్మహత్య అయి ఉండొచ్చంటూనే, హత్య కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ జి.గోవిందరావు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీం వేలిముద్రలు సేకరించింది. అక్కడే రెండు మద్యం సీసాలు, చెప్పులు ఉన్నాయి.

అనుమానాలు ఎన్నో:  మృతదేహం ఉన్న చోట రాళ్ల గుట్టలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని మంట పెట్టుకుంటే వచ్చే బాధకు అటూ ఇటూ పరుగెత్తిన ఆనవాళ్లు కూడా లేవు. కాలికి చిన్న గాయమేఉంది. ఘటనా స్థలంలోని మృతుడి కారు పోలీసులు వచ్చేసరికే స్టార్ట్‌ చేసి ఉంది. దీంతో ఇతడ్ని ఎవరైనా చంపేసి మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి కాల్చేశారా..అనే అనుమానాలూ లేకపోలేదు.  ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిన కొద్ది సేపటికే ఈ కారు నగరంలోని కొన్ని ట్రాఫిక్‌ కూడళ్లు దాటినట్లు పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో రావడం గమనార్హం. పోలీసులు సంబంధిత ప్రదేశానికి చేరుకునేటప్పటికే ఈ వాహనాన్ని ఎవరైనా నగరంలోకి తీసుకెళ్లారా..లేదా ఆ చిత్రాలు పాతవా.. అనే అంశంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.

సంఘటన స్థలంలో పరిశీలిస్తున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని