BCCI: హార్దిక్‌ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్‌ అగార్కర్‌

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తోన్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు.

Updated : 02 May 2024 19:18 IST

ముంబయి: త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ మెగా టోర్నీ కోసం ఇటీవల బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తున్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. ఐపీఎల్‌ కంటే ముందే జట్టు ఎంపికపై చర్చలు జరిగాయని అజిత్‌ తెలిపారు. 

జట్టులో టాప్‌ ఆర్డర్‌ బలంగానే ఉందని, మిడిల్‌ ఆర్డర్‌లో స్వేచ్ఛగా ఆడగలిగే క్రికెటర్‌ ఉండాలని శివమ్‌ దూబెను ఎంచుకున్నామని అజిత్‌ చెప్పారు. ఐపీఎల్‌ రికార్డు ఆధారంగానే అతడిని ఎంపిక చేశామన్నారు. కానీ, తుది జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదన్నారు. హార్దిక్‌పాండ్య ఫిట్‌గా, అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలని భావిస్తున్నామని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. రింకు సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘అందులో అతడి తప్పేం లేదు. అయినా అతడు ట్రావెలింగ్‌ సబ్స్‌లో ఉన్నాడు. ఇది కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ, జట్టును సమతుల్యంగా ఉంచే క్రమంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవు. మేం ఒక అదనపు స్పిన్నర్‌ ఉండాలనుకున్నాం. అందుకే ఇలా జరిగింది’’ అని చెప్పుకొచ్చారు. 

జట్టులో నలుగురు స్పిన్నర్లకు అవకాశం కల్పించడంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ‘‘నలుగురిని ఎందుకు ఎంపిక చేశామనేది ఇప్పుడు కాదు.. వెస్టిండీస్‌లో వెల్లడిస్తా. వ్యక్తిగతంగా నా జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని కోరుకుంటున్నా. హార్దిక్‌ సీమ్‌ ఆల్‌రౌండర్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్షర్‌, జడేజా బ్యాట్‌తోనూ అదరగొడుతున్నారు. కుల్దీప్‌, చాహల్‌ స్పిన్నర్లుగా జట్టును బ్యాలెన్స్‌ చేస్తారు’’ అని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని