Chennai Vs Punjab: ధోనీ రనౌట్‌.. నెట్టింట జితేశ్‌ శర్మపై ట్రోలింగ్‌

ధోనీని రనౌట్ చేసిన వికెట్ కీపర్ జితేశ్‌ శర్మపై నెట్టింట ట్రోలింగ్‌ మొదలైంది. అతడి ఫ్యాన్స్‌ విమర్శలు గుప్పించారు.

Published : 02 May 2024 18:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో తొలిసారి ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఔట్ కావడంతో ‘కెప్టెన్ కూల్’ అభిమానులు నెట్టింట కామెంట్లతో చెలరేగిపోయారు. అందుకు కారణమైన పంజాబ్ వికెట్ కీపర్ జితేశ్‌ శర్మను ట్రోలింగ్‌తో వేధింపులకు గురి చేశారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన చెన్నై ఇన్నింగ్స్‌లోని చివరి బంతిని ధోనీ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా బాదాడు. బౌండరీ వెళ్తున్న బంతిని హర్షల్ పటేల్ అద్భుతంగా అడ్డుకొని వికెట్‌ కీపర్‌ వైపు విసిరాడు. అప్పటికే సింగిల్‌ను పూర్తి చేసిన ధోనీ.. రెండో రన్‌ కోసం ఫాస్ట్‌గానే పరుగెత్తాడు. కానీ, జితేశ్‌ శర్మ వెంటనే వికెట్లను గిరాటేశాడు. ధోనీ మాత్రం చివరి బంతి కావడంతో ఆగకుండానే డగౌట్‌ వైపు వెళ్లిపోయాడు. థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు.  అయితే, జితేశ్‌ శర్మ ఇలా చేయడం వల్లే తమ అభిమాన ఆటగాడు ఔట్‌ అయినట్లు ధోనీ ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టారు. 

‘‘నువ్వు వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఎంపిక కాకపోవడమే మంచిదైంది. నువ్వు ‘తలా’ ధోనీని రనౌట్‌ చేశావు. ఆ ఒక్క పరుగు ఇస్తే వ్యత్యాసం ఏమైనా ఉంటుందా?’’

‘‘అతడి కోసమే మ్యాచ్‌లు చూసేవాళ్లు ఉన్నారు. అలాంటి క్రికెటర్‌ను చివరి బంతికి ఔట్‌ చేయకపోతే నష్టమేం లేదు. ధోనీ కాలు కూడా గాయమై ఉంది. నీ నుంచి (జితేశ్‌) మేం దీనిని ఊహించలేదు’’

‘‘ధోనీ అభిమానుల కోసం కష్టమైనా ఆడుతున్నాడు. క్రికెట్‌ను ఎంటర్‌టైన్‌గా మార్చిన అతడిని ఔట్ చేయడం సరైంది కాదు’’ 

‘‘ఎంఎస్‌డీని చివరి బంతికి ఔట్‌ చేయడం వల్ల మీకేమైనా లాభం ఉందా? ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఒక్కసారి కూడా అతడు పెవిలియన్‌కు చేరలేదు’’ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని