logo

ప్రశ్నించడమే నేరమా!!

జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది.

Published : 20 Apr 2024 03:15 IST

ఏయూ విద్యార్థినిపై కక్ష సాధించేలా వర్సిటీ అధికారుల నివేదిక?

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. తద్వారా విచారణ నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘వసతి గృహానికి కేటాయించిన నిధులు, ఖర్చులు, సిబ్బంది విద్యార్హత తదితర వివరాలు కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేశా. దీంతో వసతిగృహ చీఫ్‌ వార్డెన్‌ నన్ను తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్‌, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. గతంలోనూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే ఉపసంహరించుకోవాలని బెదిరించారు’ అని గతేడాది డిసెంబరులో సదరు విద్యార్థిని జాతీయ ఎస్సీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చీఫ్‌ వార్డెన్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మార్చిలో నగర పోలీసు కమిషనర్‌, వర్సిటీ ఉపకులపతికి కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.  

పోలీసు నివేదిక ఇలా: విశాఖ నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాల మేరకు విశాఖ తూర్పు ఏసీపీ విచారణ చేపట్టారు. ‘వసతి గృహంలో ఉండేందుకు అదనపు రుసుము వసూలు చేస్తుండటంతో ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగా. నువ్వు ఇలా చేస్తే హాస్టల్‌ నుంచి బయటకు పంపడానికి ఎంతో సేపు పట్టదంటూ చీఫ్‌ వార్డెన్‌ హెచ్చరించారు. అందరి ముందు గట్టిగా కేకలు వేయడంతో అవమానంగా భావించి ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశా’ అని ఆ విద్యార్థిని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ‘వసతి గృహంలో తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆ విద్యార్థినిని సిబ్బంది చూపించారు. ఆ వివరాలు నేరుగా అడిగినా చెబుతారని, చిన్న విషయాల కోసం ఆర్టీఐ అవసరం లేదని సూచించా. అంతే తప్ప ఆమెను ఏమీ అనలేదు. భవిష్యత్తులో ఆమెను ఏమీ అనడం, తిట్టడం చేయను’ అని చీఫ్‌ వార్డెన్‌ వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థిని కమిషన్‌కు పంపిన ఫిర్యాదుపై తదుపరి చర్యలు అవసరం లేదని విజ్ఞప్తి చేసినట్లు ఆ నివేదికలో పొందుపరిచారు.  

విద్యార్థినిపై వర్సిటీ అధికారిణి ఆరోపణలిలా: ‘ఆర్టీఐ కింద విద్యార్థిని కోరిన సమాచారం అందజేశాం. ఏయూ చీఫ్‌ వార్డెన్‌ను వేధించేందుకే ఆమె కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె గతంలో తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని వసతిగృహ సిబ్బంది చీఫ్‌ వార్డెన్‌కు రెండు వేర్వేరు ఫిర్యాదులు అందజేశారు. సిబ్బంది, చీఫ్‌ వార్డెన్‌తో అనవసర విషయాలకు వాగ్వాదానికి దిగుతూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తుందని 24 మంది విద్యార్థినులు కూడా ఫిర్యాదు చేశారు. సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో వీసీ ఆదేశాల మేరకు రెక్టార్‌ విచారణ చేపట్టారు. విద్యార్థిని ప్రవర్తన సరిగా లేదని క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసినా ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమెకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని చీఫ్‌ వార్డెన్‌ను ఆదేశించారు. ఆ కౌన్సెలింగ్‌ను తప్పుగా అర్థం చేసుకుని, సదరు విద్యార్థిని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు’ అని వర్సిటీ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని