logo

తెదేపాలోకి వలసల వరద

ముఖ్యమంత్రి జగన్‌ విశాఖలో ఉన్న సమయంలోనూ  వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు.

Published : 23 Apr 2024 04:38 IST

గంటా సమక్షంలో తెదేపాలో చేరిన కొవ్వాడ సర్పంచి, ఉప సర్పంచి, పద్మనాభం మండల వైకాపా సానుభూతిపరులు

మధురవాడ, పద్మనాభం, ఆనందపురం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ విశాఖలో ఉన్న సమయంలోనూ  వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. మాజీ మంత్రి భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో సోమవారం పద్మనాభం మండలం నుంచి పలువురు తెదేపాలో చేరారు. కొవ్వాడ సర్పంచి పి.రత్నం, ఉప సర్పంచి గౌరీ బాలశ్రీనివాస్‌, ఎనిమిది మంది వార్డు సభ్యులతో పాటు సుమారు వంద కుటుంబాలు గంటా చేతుల మీదుగా తెదేపా కండువాలు వేసుకున్నారు. మండల కేంద్రం పద్మనాభంకు చెందిన కో-ఆప్షన్‌ సభ్యుడు దున్న అబ్రహంతో పాటు మరో ఇరవై మంది పాస్టర్లు కూడా పార్టీలో చేరారు. వైకాపా విధానాలతో, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రవర్తనతో విసుగు చెంది చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో తెలుగుదేశంలో చేరినట్లు వారంతా పేర్కొన్నారు.

గంభీరం నుంచి: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు, మరో 20 కుటుంబాలకు చెందిన వారు కూడా తెదేపాలో చేరారు. ఈ మేరకు గంటా నివాసంలో గంభీరం తెదేపా నాయకుల సమక్షంలో మాజీ వార్డు సభ్యుడు, గ్రామ సచివాలయ కన్వీనర్‌ ఇల్లిపిల్లి ముసలయ్య, బంక వెంకటరమణ, అనుచరులు, కుటుంబీకులందరికీ గంటా పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెదేపా భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, తెదేపా సీనియర్‌ నాయకుడు వానపల్లి ముత్యాలరావు, దుక్కవానిపాలెం తెదేపా నాయకులు పాల్గొన్నారు.

వైకాపా పాలనలో 7వ వార్డు పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విసుగు చెందిన మధురవాడ వాంబేకాలనీకి చెందిన 100 మంది వైకాపా కార్యకర్తలు ఆ పార్టీని వీడి గంటా సమక్షంలో తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని