logo

మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..

చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు.

Published : 26 Apr 2024 03:04 IST

ప్రభుత్వ ఆదాయానికి గండి, పట్టించుకోని అధికారులు 

బచ్చలచెరువులో తవ్వకాలు జరపడంతో ఏర్పడిన గోతులు

పరవాడ, న్యూస్‌టుడే: చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. దీంతో వారు యథేచ్ఛగా మట్టిని కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పరవాడ మండలం పెదముషిడివాడ బచ్చలచెరువులో మట్టి అక్రమ దందా పెద్ద ఎత్తున కొనసాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. భారీగా డంపరు లారీలతో తరలించుకుపోయి చెరువులను గుల్ల చేస్తున్నారు. రెవెన్యూ, నీటిపారుదల, గనులశాఖ, విజిలెన్స్‌ అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మట్టి ఇటుకల తయారీదారుల నుంచి డిమాండ్‌ రావడంతో ఇదే అదనుగా అక్రమార్కులు బరితెగించి విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. లారీ మట్టి సుమారు రూ.7 వేలు వరకు అమ్ముకుంటున్నారు. రాత్రి 10 గంటల తర్వాత తవ్వకాలు ప్రారంభించి వేకువజామున 5 గంటల వరకు రవాణా సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చెరువులో గోతులు ఏర్పడటంతో పశువులకు, అన్నదాతలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. తవ్వకాలకు అడ్డొచ్చిన చెట్లను కూడా కూల్చేసి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు రెవెన్యూ, గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని