logo

విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ

సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 01 May 2024 03:13 IST

ఇంటింటా పింఛన్ల పంపిణీకి సర్కారు మోకాలడ్డు
అవ్వాతాతలు బ్యాంకుల్లో బాధలు పడేలా చేయాలనే!
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, పాడేరు పట్టణం

సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్వాల్సింది పోయి అంతకు మించి అవ్వాతాతలను ఇబ్బందులకు గురిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇంటికి ఒకటి, రెండు కి.మీ దూరంలో ఉన్న సచివాలయానికే వెళ్లలేకపోతున్నాం బాబోయ్‌ అంటే ఊరికి 10 నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వెళ్లేలా చేసి మరింత ఇక్కట్లుపడేలా చేస్తున్నారు పాలకపక్షానికి కొమ్ముకాసే ఉన్నతాధికారులు. ఈ పింఛన్ల పంపిణీ విధానం వెనుక వైకాపా కుట్రలు, కుతంత్రాలు బాహాటంగానే కనిపిస్తున్నా.. వాటిని విపక్షాలపైనే రుద్దుతూ రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారు.

ఇవిగో ఇక్కట్లు..

అల్లూరి జిల్లాలో ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాల్లో బ్యాంకులు లేవు. వారంతా పాడేరులో ఉన్న యూబీఐ, ఎస్‌బీఐల్లో ఖాతాలు తెరిచారు. తర్వాత మండల కేంద్రాలకు బ్యాంకులు విస్తరించినా బ్యాంకు ఖాతాలు సమీప మండలాలకు బదలాయింపు కాలేదు. ఇప్పుడు వీరంతా బ్యాంకు లావాదేవీల కోసం పాడేరు వచ్చి పడిగాపులు కాయాల్సి వస్తుంది. వాటి పరిధిలోని పింఛన్‌దారులకు ఈ తిప్పలు తప్పేటట్లు లేవు.


నక్కపల్లి మండలం రాజయ్యపేట నుంచి నక్కపల్లిలో బ్యాంకు రావాలంటే ఏడు కి.మీ దూరం ప్రయాణించాలి. రోజువారీ వ్యవహారాలతో బిజీగా ఉండే బ్యాంకులు   పింఛనుదారులకు వెంటనే నగదు ఇచ్చి పంపడం కల్లే అవుతుందని స్థానికులంటున్నారు.


హుకుంపేట, అనంతగిరి మండల సరిహద్దు ప్రాంతాలైన జర్రకొండ, కనిక, గేదెలపాడు, పట్టణం, ఉప్ప, రాప, నిమ్మలపాడు, మెరకచింత వంటి ప్రాంతాల్లో అప్పట్లో బాకూరు ఎస్‌బీఐ దగ్గరగా ఉండడంతో బ్యాంకుఖాతా తెరుచుకున్నారు. ఆ తర్వాత ఈ బ్యాంకును పాడేరు పట్టణానికి మార్పు చేశారు. ఆయా ప్రాంతాలు పాడేరుకు 35 నుంచి 40 కిలో మీటర్లు దూరంలో ఉండడమే కాకుండా సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు.


నర్సీపట్నం మండలం గబ్బాడలో వందకు పైగా పింఛన్‌దారులున్నారు. వారి ఖాతాల్లో పింఛను సొమ్ములు జమచేయడం వల్ల వారు ఏడు కి.మీ దూరంలో ఉన్న నర్సీపట్నం బ్యాంకుకు వెళ్లాల్సిందే.


దేవరాపల్లి మండలం బోడిగరవు, నేరళ్లపూడి గ్రామాలకు చెందిన లబ్ధిదారులు 10 కి.మీ ప్రయాణిస్తేగాని బ్యాంకులకు చేరే పరిస్థితి లేదు.


సాంకేతిక చిక్కులు అదనం..

బ్యాంకుల్లో ఖాతాలున్నా చాలా కాలంగా లావాదేవీలు నిర్వహించకపోవడంతో వాటిలో నగదు జమ అవుతుందాలేదోనని లబ్ధిదారులు భయపడుతున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేయని ఖాతాలు చాలావరకు ఉన్నాయి. అవ్వాతాతల దగ్గర ఏటీఎం కార్డులు ఎక్కువ మంది దగ్గర ఉండడం లేదు. వీరంతా బ్యాంకు వెళ్లి విత్‌డ్రా ఫారం నింపే తీసుకోవాల్సి ఉంటుంది. ఏజెన్సీలో ఒకరోజుంతా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తేగాని సొమ్ము చేతికి అందే పరిస్థితి లేదు. మండుటెండల్లో ఇలా ఇబ్బందులకు గురిచేయడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని