logo

కార్మికులపై కరకు మనసు!!

‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్‌. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన.

Published : 01 May 2024 03:17 IST

కబుర్లతో కష్టజీవులకు ఒనగూరిందేంటి?
ప్రాణాలకు విలువివ్వని జగన్‌ సర్కార్‌
ఈనాడు, అనకాపల్లి - న్యూస్‌టుడే, అచ్యుతాపురం, అనకాపల్లి పట్టణం

‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్‌. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. కార్మికుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. వారికి హక్కుగా కల్పించాల్సిన సదుపాయాలను దూరం చేశారు. అచ్యుతాపురం పరిసరాల్లో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించి కార్మికుల ఆరోగ్యానికి భరోసా ఇస్తామన్న హామీలు గాలిలో కలిపేశారు.

చ్యుతాపురం, పరవాడ ఫార్మా సెజ్‌లలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఏటా పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురవుతున్నారు. అయినా వారికి స్థానికంగా కనీస వైద్య సేవలు అందించే పరిస్థితి లేకుండా పోయింది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు చిన్న సుస్తీ చేసినా అనకాపల్లి, విశాఖ జిల్లా కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. వీరికి చేరువలో వైద్యసేవలు అందించేందుకు ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు చేసి మూడేళ్లయినా నిర్మాణం ప్రహరీ గోడ స్థాయి దాటలేదు.

ప్రమాదాల సమయంలోనే హడావుడి

పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మిస్తామని హడావుడి చేయడం.. తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. ప్రత్యేక ఆర్థిక మండలిలో 208 రసాయన, ఫార్మా కంపెనీలతోపాటు ఇతర భారీ పరిశ్రమలున్నాయి. వీటిలో పనిచేసే కార్మికులకు ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని పలుమార్లు కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఆసుపత్రి నిర్మాణానికి అచ్యుతాపురం సెజ్‌లో 2 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీ కేటాయించింది. ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ముందుకు కదల్లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.48 లక్షలమంది కార్మికులుంటే అందులో 78 వేల మంది ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నారు. కార్మికుల ఆరోగ్యం కంటే కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లపైనే అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టడంతోనే ఈఎస్‌ఐ ఆసుపత్రి సాకారం కావడం లేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


నిర్మాణ కార్మికుల్లో నిస్తేజం:  వైకాపా పాలనలో భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు దుర్భరంగా మారాయి. గతంలో కూలీల కోసం యజమానులు వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎప్పడు పని దొరుకుతుందా అని కూలీలు పనుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. పెరిగిన ఇసుక ధర, సిమెంట్, ఇనుము ధరలు ఆకాశాన్ని అంటడంతో ఇంటి నిర్మాణాలపై  యజమానులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కూలీలకు పనులు దొరకడం లేదు. ముఖ్యంగా ఇసుక ధర పెరగడం డబ్బులు పెట్టి కొందామన్న అందుబాటులో లేకపోవడంతో చాలామంది నిర్మాణాలు ఆపేశారు. దీని ప్రభావం భవన నిర్మాణ కార్మికులపై పడింది. జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి కార్మికశాఖ కార్యాలయాల పరిధిలో 1,10,069 మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్‌ అయ్యారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్‌లో ఉన్న నిధులను జగన్‌ సర్కారు ఇతర అవసరాలకు వాడుకోవడంతో వీరి గోడు వినే నాథుడే లేకుండా పోయాడు.


చ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో 55 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు ప్రతి వైద్య అవసరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి కానీ, 45 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం కానీ వెళ్లాల్సి వస్తోంది. అనకాపల్లి దూరం తక్కువే అయినా అధ్వాన రోడ్డు కారణంగా ప్రయాణ సమయం గంట పడుతోంది. అత్యవసర సమయంలో ఇంత జాప్యం ప్రాణాంతకంగా మారుతోంది.


ఇవీ ప్రమాదాలు..

  • 2022 డిసెంబర్‌లో పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో ప్రమాదం జరిగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.
  • పరవాడ ఫార్మాసిటీలోనే సాయినర్‌, మరికొన్ని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకుని కార్మికులు గాయపడ్డారు.  
  • సాహితి ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి ఆరుగురు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకునేచోట ఆసుపత్రి సేవలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. అధికారులు, పాలకపక్ష నేతలు ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించక పోవడంతో కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండాపోతోంది.  
  • గతేడాది సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలోవిషవాయువు పీల్చి 539 మంది మహిళలు అస్వస్థతకు లోనయి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందారు.  
  • ఎంఎఫ్‌జీ ఎఫ్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.

అక్కడ బతుకుతెరువు లేక.. ఇక్కడ బతకలేక!: బతుకుతెరువు కోసం వచ్చిన కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. అచ్యుతాపురం పరిసర పరిశ్రమల్లో 10 వేలమంది వరకు ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా కోళ్లఫారాలను మరిపించే గుడారాల్లో దయనీయంగా జీవిస్తున్నారు. గతేడాది దుప్పితూరులో గుడారాల్లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన ముగ్గురు కార్మికులు డయేరియా లక్షణాలతో మృతిచెందారు.

వలస కార్మికులు వారి కుటుంబాలతో ఎక్కడ నివాసం ఉంటున్నారో అనే వివరాలేవీ జిల్లా యంత్రాంగం వద్ద లేకపోవడం... వీరి భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని