logo

కొత్త పంచాయతీలు..కాసులకు కష్టాలు

జిల్లాలో ఎన్నికలకు ముందు 40 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో కొన్నింటిలో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్ల వివాదాల నేపథ్యంలో ఎన్నికలు జరగలేదు. సాధారణంగా ఓ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయాలంటే సర్పంచి,

Published : 17 Jan 2022 05:58 IST


శ్రీరంగరాజపురం పంచాయతీ 

న్యూస్‌టుడే, గజపతినగరం, గరివిడి, సీతానగరం జిల్లాలో ఎన్నికలకు ముందు 40 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో కొన్నింటిలో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. రెండు చోట్ల వివాదాల నేపథ్యంలో ఎన్నికలు జరగలేదు. సాధారణంగా ఓ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయాలంటే సర్పంచి, కార్యదర్శి పొజిషన్‌ ఐడీ అనుసంధానమైన ఖాతా నుంచి నిధులు ఖర్చు చేయొచ్చు. కొత్తగా ఏర్పడిన  పంచాయతీలకు వారం రోజుల కిందట సర్పంచుల పేరుతో ఖాతాలు ఏర్పాటైనా..గ్రామ కార్యదర్శులకు సంబంధించి ఐడీ మాత్రం ఇప్పటికీ వాటికి అనుసంధానించలేదు. దీంతో నిధులు లేక పనులు చేయడం లేదు. పాత పంచాయతీల నుంచి రావాల్సిన వాటా కూడా కొత్తవాటికి బదలాయింపు కాలేదు. వాటిని ఉపఖజానాశాఖ అధికారులు సరిచేయాలి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ.7 లక్షల ప్రోత్సాహక నిధులు కూడా జమ కాలేదు.

* గజపతినగరం మండలంలోని పాత శ్రీరంగరాజపురం పంచాయతీ నుంచి కొత్త శ్రీరంగరాజపురం పంచాయతీ కొత్తగా ఏర్పాటైంది. పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు నగదు లేదు, వీధిదీపాల ఏర్పాటు, కాలువల మరమ్మతులు, తాగునీటి నిర్వహణ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదైనా పంచాయతీకి నిధులు ఖర్చుచేసే అవకాశం లేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని సర్పంచి పైడిపునాయుడు వాపోయారు. 
* ఇదే మండలం కొత్తవలస పంచాయతీ నుంచి ఏర్పడిన రంగుపురంలో కాలువలు, రహదారి సమస్య పరిష్కారానికి నిధులు లేవని సర్పంచి లక్ష్మణరావు చెబుతున్నారు.
* గరివిడి మండలానికి చెందిన కొండశంభాం పంచాయితీ నుంచి పీజే పాలెం, ఏనుగువలస పంచాయతీ నుంచి బాగువలస కొత్తగా ఏర్పడ్డాయి. రెండు చోట్ల పాలకవర్గాలను ఎన్నుకున్నారు. ఏడాది గడుస్తున్నా కార్యదర్శి పొజిషన్‌ ఐడీ అనుసంధానం కాక పారిశుద్ధ్య పనులు చేసినా నిధులు తీయలేని పరిస్థితి. కాలువల అనుసంధానం, తాగునీటి నిర్వహణ సమస్యలు వేధిస్తున్నాయి. బాగువలసలో రహదారులకు మరమ్మతులు చేయలేని దుస్థితి. 
* సీతానగరం మండలం లక్ష్మీపురం పంచాయతీ నుంచి ఏగోటివలస పంచాయతీ కొత్తగా ఏర్పాటైంది. బ్యాంకు ఖాతాలు తెరిచారు. కార్యదర్శి ఐడీ క్రియేట్‌ కాక నిధులు జమకాలేదు. గ్రామాన్ని ఆనుకుని తోటపల్లి కుడి కాలువ వెళ్తుండడంతో బురద చేరుతోంది. నిధులు లేక  రిటర్నింగు గోడ నిర్మించాలన్న కొత్త పాలకవర్గం ఆలోచన ఆచరణకు నోచుకోవడం లేదు. 

చిన్న పనికీ సమస్యే...
వీధి దీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా, కాలువల శుభ్రం, చెత్త తరలింపునకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఏడాదిగా అవకాశం లేకపోయింది. సమస్యల పరిష్కారం, కొత్త పనులకు అవకాశం లేకుండా పోయిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ నిధులు జమకాలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికీ పడలేదు.

పాత పంచాయతీ నిధులపై...
పాత వాటిలో నిధులుంటే అక్కడి సర్పంచి కొత్త పంచాయతీకి చెందాల్సిన నిధులకు సంబంధించి అనుమతిస్తే వీరి ఖాతాకు బదలాయించొచ్చు. అలా ఇప్పలవలస పంచాయతీ నుంచి చింతాడవలసకు మార్చాం.             
- సింహాచలం, ఉపఖజానాధికారి, గజపతినగరం.
 సర్పంచి ఐడీతో ఖర్చు చేసుకోవచ్చు 
కొత్త పంచాయతీలకు సంబంధించి నిధులను గ్రామ కార్యదర్శుల ప్రమేయం లేకుండా వినియోగించే పూర్తి అధికారం సర్పంచులకు ఉంది. పాతపంచాయతీల నిధులు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. 15వ ఆర్థిక సంఘ నిధులు రాలేదు. ఇతర సాధారణ నిధులు జమయ్యేలా చర్యలు తీసుకున్నాం.                    
- ఎస్‌.సుభాషిణి, జిల్లా పంచాయతీ అధికారి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని