logo

రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపా గెలవాలి

‘వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారు. ఇప్పుడు మన కోసం కాదు.. మన బిడ్డలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపా గెలిచి తీరాలని మాజీ మంత్రి, తెదేపా  పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

Published : 26 May 2023 02:53 IST

నాలుగేళ్లలో రూ.వేల కోట్లు తాగించిన వైకాపా
మినీ మహానాడులో అయ్యన్న  

సాలూరు, న్యూస్‌టుడే: ‘వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారు. ఇప్పుడు మన కోసం కాదు.. మన బిడ్డలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపా గెలిచి తీరాలని మాజీ మంత్రి, తెదేపా  పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సాలూరులో పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు, మినీ మహానాడు గురువారం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అయ్యన్న మాట్లాడుతూ ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులతో మద్యం, మాంసం అమ్మిస్తున్నారని, విడతల వారీగా మద్యం నిషేధమని చెప్పి నాలుగేళ్లలో రూ.వేల కోట్లు తాగించారని విమర్శించారు. రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్లు ఇచ్చామని వైకాపా చెబుతోందని, అందులో కనీసం సగం కూడా కట్టలేకపోయిందన్నారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కేంద్రం ఇస్తోంది తప్ప రాష్ట్రం ఏమీ ఇవ్వకుండా గృహ లబ్ధిదారులను మోసం చేస్తోందన్నారు.

ఇసుక, సిమెంట్‌, ఇనుము ధరలు పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కేంద్రమంత్రి, ముఖ్యమంత్రులను కూడా సీబీఐ అరెస్టు చేసిందని, ఇప్పుడు ఎంపీ అవినాష్‌ను అరెస్టు చేయలేకపోతోందని ఆరోపించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సంక్షేమ పాలనకు బాటలు వేస్తే, చంద్రబాబు సాంకేతిక విప్లవం తీసుకువచ్చి ఉద్యోగ కల్పన, పరిశ్రమలు ఏర్పాటు చేశారన్నారు. తెదేపా పాలనలో 25 వేల కి.మీ చంద్రన్నబాటలో సీసీ రోడ్లు వేస్తే ఈ ప్రభుత్వం కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో వేస్తున్న రోడ్లన్నీ తెదేపా పాలనలో మంజూరైనవే అన్నారు. నేరచరిత్ర కలిగిన సీఎంను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం తెదేపా పాలన రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అరకు పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు బి.చిరంజీవులు, జయకృష్ణ, గిడ్డి ఈశ్వరి, జగదీశ్వరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌పీ భంజ్‌దేవ్‌, జగదీశ్‌, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని