logo

మార్కెట్‌లో ‘కిరాయి’ లొల్లి!

వరంగల్‌ లక్ష్మీపురంలో కూరగాయల మార్కెట్‌లో కొంత కాలంగా వ్యాపారులు.. అధికారుల మధ్య కొనసాగుతున్న కిరాయి లొల్లి కొలిక్కి రావడం లేదు.

Published : 27 May 2022 03:25 IST

కూరగాయల మార్కెట్‌

ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ లక్ష్మీపురంలో కూరగాయల మార్కెట్‌లో కొంత కాలంగా వ్యాపారులు.. అధికారుల మధ్య కొనసాగుతున్న కిరాయి లొల్లి కొలిక్కి రావడం లేదు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన నూతన మార్కెట్‌లో నిర్మించిన 158 ప్లాట్‌ఫాంలపై కూరగాయలు విక్రయించే రిటైల్‌ వ్యాపారులు మూడు నెలల నుంచి కిరాయి చెల్లించకపోవడంతో.. మార్కెట్‌ అధికారులు వారికి నోటీసులు జారీచేశారు. ప్రస్తుతానికి ఒక్కో వ్యాపారి రూ.2,300 చెల్లించాల్సి ఉంది. అంటే మూడు నెలల నుంచి దాదాపు రూ.10 లక్షలు మార్కెట్‌ ఆదాయానికి గండి పడింది.
70 శాతం ప్లాట్‌ఫాంలు ఖాళీనే..
నూతన కూరగాయల మార్కెట్‌లో 158 ప్లాట్‌ఫ్లాంలను నిర్మిస్తే.. దాదాపు 70 శాతం ఖాళీగానే కనిపిస్తున్నాయి. మార్కెట్‌ అధికారుల నియంత్రణ లేకపోవడంతో మార్కెట్‌ చుట్టూ చిల్లర వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమించుకుని కూరగాయలు విక్రయిస్తుండడంతో.. రిటైల్‌ వ్యాపారం దివాళా తీస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. పాతమార్కెట్‌లో రూ.200 మాత్రమే ఉన్న కిరాయిని అమాంతం రూ.2,300 పెంచడంతో.. వ్యాపారమూ సాగక కిరాయి చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. ఇటీవల కిరాయి విషయంలో వ్యాపారులు తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ను సంప్రదించగా.. కిరాయి వసూళ్లలో ఒత్తిళ్లకు పాల్పొడద్దని ఆదేశించడంతో.. అధికారులు సందిగ్ధంలో పడిపోయారు.


వారిని నియంత్రిస్తేనే కిరాయి చెల్లిస్తాం..
- చింతాకుల సునిల్‌, రిటైల్‌ వ్యాపారి

మార్కెట్‌ చుట్టూ.. మార్కెట్‌లోని 6*6, 8*8 మార్కు వేసిన డబ్బాలలో విచ్చలవిడిగా కూరగాయలను విక్రయిస్తున్నవారిని నియంత్రిస్తేనే కిరాయి చెల్లిస్తాం. ఎన్నో ఏళ్లుగా లైసెన్సులను కలిగి ఉండి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న మా వద్ద ఎక్కువ మొత్తం కిరాయి వసూలు చేయడం సరికాదు.


వ్యాపారులతో సమావేశం ఏర్పాటుచేస్తాం..
- బి.రాహుల్‌, మార్కెట్‌ కార్యదర్శి

నూతన మార్కెట్‌లో కల్పించిన వసతుల దృష్ట్యా కొంత మేర కిరాయి పెంచాం. త్వరలో రిటైల్‌ వ్యాపారులతో సమావేశం ఏర్పాటుచేసి తగిన నిర్ణయాలు తీసుకుంటాం.




 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని