logo
Published : 06 Aug 2022 03:01 IST

మంజూరై నాలుగేళ్లు.. సమస్య ఎక్కడిదక్కడే!

ఏటూరునాగారం  ఏజెన్సీలో కిడ్నీ రోగులకు తప్పని తిప్పలు

ఆరంభానికి నోచని డయాలసిస్‌ కేంద్రం

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి - ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ములుగు జిల్లా ఏజెన్సీలో ఏటా మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం తదితర మండలాల్లోని సుమారు 50 మందికి పైగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అందుబాటులో డయాలసిస్‌ చేయించుకునే సౌకర్యం లేక చికిత్స కోసం వరంగల్‌, హైదరాబాద్‌ తదితర నగరాలకు రాకపోకలు సాగిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు 2018లోనే డయాలసిస్‌ కేంద్రం మంజూరైనా నేటికీ ఆరంభానికి నోచుకోకపోవటం గమనార్హం.

చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు

కిడ్నీ బాధితులు డయాలసిస్‌ కోసం వరంగల్‌ ఎంజీఎం, హైదరాబాద్‌ గాంధీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. గంటలకొద్దీ సమయం ప్రయాణానికే వెచ్చిస్తున్నారు. ప్రయాణ ఛార్జీలు, మందులు, ఇతర ఖర్చులతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆరోగ్యశ్రీలో డయాలసిస్‌ చేస్తుండటం కొంత ఊరటనిచ్చినా, దూరాభారమే ప్రధాన సమస్యగా మారింది.

గోదావరి పరీవాహక మండలాల్లోనే అనేక మందికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడి తాగునీటిలో ఖనిజాలు, లవణాల శాతంలో హెచ్చుతగ్గులున్నాయా, తీసుకునే ఆహారంలో సమస్యలున్నాయా అనేది తేలాల్సి ఉంది. వీటిపై అధికారులు అధ్యయనం చేసి, తమ ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం 2018లో మంజూరైంది. ఐదు మంచాలు, రెండు డయాలసిస్‌ యంత్రాలతో దాన్ని ప్రారంభించాల్సి ఉన్నా పట్టాలెక్కడం లేదు.


ఈయన ఏటూరునాగారానికి చెందిన అందె సాంబశివుడు. స్థానికంగా మిర్చి బండి నడుపుతూ జీవిస్తున్నారు. 8 నెలల నుంచి నెలకు 15 రోజులు డయాలసిస్‌ కోసం వరంగల్‌కు వెళ్తున్నారు. ఏటూరునాగారం నుంచి వరంగల్‌కు రానూపోను 224 కిలోమీటర్లు. 6 గంటల ప్రయాణం. అక్కడ డయాలసిస్‌కు 4 గంటల సమయం పడుతుంది. నెలకు రూ.15 వేలు మందులకు, వెళ్లినప్పుడల్లా రూ. 2 వేల వరకు ఖర్చులు అవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రూ. 2 లక్షల వరకు అప్పు చేసినట్లు వాపోయారు.  


ఈమె పేరు వావిలాలు శాంతమ్మ. డయాలసిస్‌ కోసం కుమారుడితో కలిసి నెల రోజుల నుంచి వరంగల్‌కు వచ్చివెళ్తున్నారు. ముళ్లకట్ట నుంచి వరంగల్‌కు 120 కిలోమీటర్లు. ఇద్దరికి బస్సుఛార్జీలు రూ.1000, ఇతర ఖర్చులకు రూ.500 వరకు అవుతున్నాయని వాపోయారు. గడిచిన మూడు వారాల్లో 9 సార్లు వెళ్లివచ్చామని, రూ.30 వేలు ఖర్చయ్యాయని చెప్పారు.  


ఈయన మంగపేట మండలం కమలాపురానికి చెందిన పుల్లయ్య. ఐదేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. కమలాపురం నుంచి వరంగల్‌కు 125 కిలోమీటర్లు. నడవలేని పరిస్థితుల్లో భార్యతో కలిసి డయాలసిస్‌కు వెళ్తున్నారు. అంత దూరం ప్రయాణం చేయలేక కాళ్లు, చేతులకు వాపులు వస్తున్నాయని వాపోతున్నారు. భార్య కూలికి వెళ్తేనే వీరికి పూట గడిచేది.  


ఈయన వెంకటాపురం మండలం బెస్తగూడేనికి చెందిన బట్ట రామదాసు. వరంగల్‌కు రానూపోను 280 కిలోమీటర్లు. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని చెబుతున్నారు. నెలకు రూ.30 వేలు ఖర్చు అవుతోందని వాపోతున్నారు.


త్వరలో ప్రారంభిస్తాం

- డా.సురేష్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, ఏటూరునాగారం సీహెచ్‌సీ

స్థలాభావ సమస్యతో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. అది పూర్తికాగానే సీహెచ్‌సీలో డయాలసిస్‌ యూనిట్ ప్రారంభిస్తాం.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని