logo

కాకతీయ వైభవం ఉట్టిపడేలా శివాలయం పునఃప్రతిష్ఠ

శిథిలావస్థలో ఉన్నటువంటి ఏడు శతాబ్దాల కిందట కాకతీయులు నిర్మించిన పర్వతాల శివాలయాన్ని స్థానిక గుట్టపైకి తీసుకెళ్లారు. కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా పునర్నిర్మాణం చేశారు.

Published : 25 Jan 2023 05:56 IST

26 నుంచి వేడుకలు ప్రారంభం

పర్వతగిరి(వర్ధన్నపేట), న్యూస్‌టుడే:  శిథిలావస్థలో ఉన్నటువంటి ఏడు శతాబ్దాల కిందట కాకతీయులు నిర్మించిన పర్వతాల శివాలయాన్ని స్థానిక గుట్టపైకి తీసుకెళ్లారు. కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా పునర్నిర్మాణం చేశారు. విగ్రహ, యంత్ర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమాలను ఈ నెల 26నుంచి మూడు రోజులపాటు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. 26న సుప్రభాతసేవతో కార్యక్రమాలు మొదలై వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు జరుగుతాయి. 27న మహాలింగార్చన, రుద్రాభిషేకం, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయి. 28న  విగ్రహప్రతిష్ఠ, నందీశ్వర, శిఖర, ధ్వజ ప్రతిష్ఠలు ఉంటాయి.

ఇదీ దేవాలయ చరిత్ర..

కాకతీయుల పాలన శివాలయాల కేంద్రంగా సాగేది. ఈ క్రమంలో రాణిరుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడి పేరుతో సుమారుగా 700 సంవత్సరాల క్రితం ప్రస్తుత పర్వతగిరి గ్రామంలోని పర్వతాల గుట్ట కింద ప్రతాప రుద్రగిరి గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగు, సాగు నీటి సౌకర్యార్థం చెరువు, కుంటలను నిర్మించడంతో పాటు శివాలయం నిర్మించారు. కొన్నేళ్లకు ఆలనాపాలన లేకపోవడంతో శివాలయం శిథిలావస్థకు చేరి ధ్వంసమైంది. కాలక్రమేణా ప్రతాపరుద్రగిరి గ్రామం ప్రతాపగిరిగా... ఇప్పుడు పర్వతగిరిగా మారింది. కాకతీయుల నాటి ఆనవాళ్లు నేటికీ కనిపించటం వారి పాలనకు నిదర్శనం. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో  ఆర్డీఎఫ్‌ వ్యవస్థాపక సభ్యులు ఎర్రబెల్లి రామోహన్‌రావు చరిత్ర కలిగిన ఈ శివాలయం పునర్నిర్మాణానికి నడుం బిగించారు. గుట్టపై పూర్వ వైభవం కనిపించేలా రాళ్లతో శివాలయం నిర్మాణం చేపట్టారు.

పూర్వ వైభవానికి శాశ్వత పనులు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు పర్యవేక్షణలో దేవాదాయ శాఖ నుంచి రూ.70లక్షలు నిధులు మంజూరు కాగా దాతల నుంచి సుమారుగా రూ.7కోట్లు సేకరించి పునర్నిర్మాణం చేపట్టారు. పూర్వ వైభవం తెచ్చేలా శాశ్వత పనులు చేపట్టారు. గుట్టపైకి వెళ్లడానికి¨ గుట్టను తొలచి సుమారుగా 380మీటర్ల ఎత్తులో 700 మెట్లు, రెయిలింగ్‌ పనులు చేశారు. మరో వైపు వాహనాల కోసం  సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. గుట్టపై పురోహితుడు, వాచ్‌మెన్‌ ఉండటానికి గదులు, విద్యుత్తు సౌకర్యం, పార్కింగ్‌,. తాగునీరు అందుబాటులో ఉంచారు. గుట్ట చుట్టూ పచ్చటి ప్రకృతి ఆహ్లాదకరంగా కనువిందు చేయనుంది.

గుట్టపై శివాలయం

రిజర్వాయర్‌లో బోటింగ్‌

పర్వతగిరిలో మూడు రోజుల పాటు నిర్వహించే పర్వతాల శివాలయం ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రిజర్వాయర్‌లో బోటింగ్‌ ఏర్పాటు చేశారు. దర్శనార్థం వచ్చే భక్తులు ఆహ్లాదకరంగా ఉండేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. పెద్ద చెరువు రిజర్వాయర్‌ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి కెనాల్‌ కాలువ ద్వారా నీటిని నింపి బోటింగ్‌కు అనుకూలంగా మార్చారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని