logo

పెద్దాసుపత్రిలో స్కానింగ్‌ సేవలేవీ?

జనగామ రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఉన్న సమయంలో ఏరియా ఆసుపత్రిగా, ఆ తర్వాత జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జిల్లా ప్రధాన ఆసుపత్రిగా, వైద్య కళాశాల మంజూరు కావడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాల/జనరల్‌ ఆసుపత్రిగా మారింది

Published : 29 Jan 2023 06:20 IST

నిర్మాణంలో ఉన్న భవనం

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఉన్న సమయంలో ఏరియా ఆసుపత్రిగా, ఆ తర్వాత జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జిల్లా ప్రధాన ఆసుపత్రిగా, వైద్య కళాశాల మంజూరు కావడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాల/జనరల్‌ ఆసుపత్రిగా మారింది. వైద్య కళాశాల మంజూరుతో జిల్లా ప్రజలకు అత్యాధునిక వసతులతో వైద్య సేవలందనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారు. అయితే ఆచరణలో ఇందుకు భిన్నంగా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. జనగామ జనరల్‌ ఆసుపత్రిలో మూడేళ్లుగా సిటీ స్కానింగ్‌ సేవలు లేకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ప్రైవేటు కేంద్రాలే దిక్కు

జనగామలో గత 15 ఏళ్లుగా ఏరియా ఆసుపత్రి స్థాయిలో ఉన్నప్పటి నుంచి సిటీ స్కానింగ్‌ సేవలు అందిస్తున్నారు.  స్కానింగ్‌ విభాగంలోని యంత్రం పని చేయకపోవడంతో గత మూడేళ్లుగా సిటీ స్కానింగ్‌ సేవలు అందడం లేదు. సేవలను పునరుద్ధరించకపోవడంతో వివిధ మండలాల నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులు సిటీ స్కానింగ్‌ కోసం ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారంగా ప్రజల నుంచి అధిక ధరలు  వసూలు చేస్తున్నారు. స్కానింగ్‌ ధరలను నియంత్రించే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో జిల్లా ఆసుపత్రి వైద్య కళాశాలకు అనుబంధంగా మారి జనరల్‌ ఆసుపత్రిగా పేరు మారడంతో సిటీ స్కానింగ్‌ ఏర్పాటుపై డీఎంఈ అధికారులైనా దృష్టి సారిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నత్తనడకన నిర్మాణ పనులు

జనగామలో ఏడాది క్రితం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో స్కానింగ్‌ విభాగం కోసం ప్రత్యేక భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనికి రూ.65 లక్షలు మంజూరు చేశారు. 4 నెలల్లో భవన నిర్మాణం పూర్తి కాగానే సిటీ స్కానింగ్‌ యంత్రాన్ని ఏర్పాటు చేసి సేవలను పునరుద్ధరించాలని తొలుత భావించారు. ఏడాది గడిచినా ఇప్పటికీ భవన నిర్మాణం పూర్తి కాలేదు. ఇదే సమయంలో జనగామ ఆసుపత్రికి రూ.2 కోట్లతో సిటీ స్కానింగ్‌ యంత్రం మంజూరైంది. హైదరాబాద్‌ నుంచి ఈ యంత్రాన్ని తీసుకొస్తే బిగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో భవన నిర్మాణం పూర్తి కాగానే యంత్రాన్ని తీసుకొచ్చి బిగించాలనే ఆలోచనలో వైద్యాధికారులు ఉన్నారు. భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో స్కానింగ్‌ సేవల పునరుద్ధరణలో జాప్యం జరుగుతోంది.


త్వరలో సేవలను పునరుద్ధరిస్తాం
- డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌, జనరల్‌ ఆసుపత్రి

మున్సిపల్‌ కార్యాలయ సమీపంలో స్కానింగ్‌ సేవల కోసం కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. తొలుత మంజూరు చేసిన నిధులు సరిపోలేదనే కారణంతో గుత్తేదారు పనుల్లో జాప్యం చేశారు. అదనపు నిధులు విడుదల చేసి భవన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతాం. జనగామకు రూ.2 కోట్లతో సిటీ స్కానింగ్‌ యంత్రం మంజూరైంది. హైదరాబాద్‌లో సిద్ధంగా ఉంది. త్వరలో సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని