logo

అసంపూర్తి కూడళ్లు.. ప్రయాణికుల అవస్థలు!

వరంగల్‌ ప్రాంతంపై పాలకుల చిన్నచూపో.. అధికారుల అలసత్వమో తెలియదు కాని హనుమకొండతో పోల్చితే వరంగల్‌ అభివృద్థి విషయంలో ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు.

Published : 31 Jan 2023 05:28 IST

అసంపూర్తి పనులకు అద్దం పడుతున్న బాలాజీనగర్‌ కూడలి

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: వరంగల్‌ ప్రాంతంపై పాలకుల చిన్నచూపో.. అధికారుల అలసత్వమో తెలియదు కాని హనుమకొండతో పోల్చితే వరంగల్‌ అభివృద్థి విషయంలో ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు. వరంగల్‌లో చేపట్టిన ప్రధాన కూడళ్ల అభివృద్ధి ఇందుకు అద్దం పడుతోంది. హనుమకొండలో కూడళ్లు పూలవనంతో పచ్చగా దర్శనమిస్తే వరంగల్‌లో బోసి పోయి కనిపిస్తున్నాయి.
* వరంగల్‌ కాశీబుగ్గ నుంచి ఎనుమాములకు వెళ్లే ప్రధాన రహదారిలో బాలాజీనగర్‌ కూడలి విస్తరణ చేపట్టి ఏడాది కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గుండ్రంగా ఓ గోడకట్టి నాలుగు వైపులా డివైడర్ల కోసం రాళ్లతో కట్టడాలు కట్టి వదిలేశారు. కూడలి అనగానే గుర్తుకు వచ్చే పచ్చదనం ఇక్కడ మచ్చుకు కానరాదు, ఆహ్లాదం కోసం వాటర్‌ ఫౌంటెన్లు లేవు. వీధిలైట్లు లేక చీకటికి చిరునామాగా మారింది.
* వరంగల్‌ లేబర్‌కాలనీ తెలంగాణ జంక్షన్‌ పేరుకే పెద్ద కూడలి. ఇక్కడ సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి వదిలేశారు. అసంపూర్తి కూడళ్లను అభివృద్ధి చేసి అందం, ఆహ్లాదంతోపాటు ప్రమాదాల నివారణకు శ్రీకారం చుట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
* వరంగల్‌ ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌ కూడలి పనులు చేపట్టి ఆరుమాసాలు.  రోడ్డు మద్యలో గుండ్రంగా ఓ అడగు ఎత్తులో రాళ్ల గోడ కట్టి వదిలేశారు. ఇక్కడ రాత్రి వేళ చిమ్మ చికటే.  నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ వాహనదారుల ప్రమాదాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
*వరంగల్‌ కాశీబుగ్గ అంబేడ్కర్‌ కూడలిలో జంక్షన్‌ విస్తరణ కోసం సిద్దయ్య హోటల్‌ వెపు, లక్ష్మీపురం వైపు రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణ సముదాయాలను కూల్చేశారు. పనులు ఐదు మాసాల క్రితం పూర్తి చేసినా కూడలి విస్తరణకు శ్రీకారం చుట్టలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని