logo

రాష్ట్ర పద్దు.. నగరానికి ముద్దు!

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సంవత్సరం పద్దు(బడ్జెటు)పై మహా నగర పాలక సంస్థ గంపెడాశలు పెట్టుకుంది.

Published : 08 Feb 2023 05:09 IST

ఆకర్షణీయ నగరం పనులకు రానున్న రూ.200 కోట్లు

వరంగల్‌ ప్రధాన తంతి తపాలా కేంద్రం కూడలిలో ఆగిన స్మార్ట్‌ రోడ్డు పనులు

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌:  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సంవత్సరం పద్దు(బడ్జెటు)పై మహా నగర పాలక సంస్థ గంపెడాశలు పెట్టుకుంది. ఈసారి నిధులు వస్తాయనే ధీమాలో పాలకవర్గం, అధికారులున్నారు. రాష్ట్ర పద్దులో గ్రేటర్‌ వరంగల్‌కు ప్రత్యేకంగా నిధులు రానున్నాయి. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న స్మార్ట్‌ సిటీ పథకం పనులకు రూ.200 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా కింద సుమారు రూ.250 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.50 కోట్లు విడుదలయ్యాయి. త్వరలో రూ.200 కోట్లు విడుదల కానున్నాయి.  రాష్ట్ర బడ్జెటులో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.11,327 కోట్లు కేటాయించారు. ఇందులో పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.1500 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ తదితర నగరపాలికలు, ముఖ్యమైన పురపాలికలకు నిధులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరానికి చెందిన శాసనసభ్యులు శ్రద్ధపెడితే ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశాలుంటాయని నిపుణులంటున్నారు.

వేగవంతం కానున్న అసంపూర్తి పనులు

స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా సుమారు రూ.976.50 కోట్లతో 76 పనులు ప్రతిపాదించారు. కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులు కేటాయించాలి. నిధుల విడుదలలో జాప్యం కావడంతో ఐదేళ్లలో కేవలం రూ.39.26 కోట్లతో 26 పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సుమారు రూ.193 కోట్లు కేటాయించింది. మరో రూ.50 కోట్లు త్వరలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఇప్పటివరకు కేవలం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈసారి 2023-24 రాష్ట్ర వార్షిక పద్దులో స్మార్ట్‌ సిటీ పనులకు రూ.200 కోట్లు కేటాయించింది. ఈ నిధులన్నీ వరంగల్‌ నగరానికి ఇవ్వనున్నారు.

* స్మార్ట్‌ సిటీ పనులు చేస్తున్న గుత్తేదారులకు చేపట్టిన పనులకు బిల్లులివ్వక పోవడంతో హనుమకొండ వడ్డేపల్లి, వరంగల్‌ భద్రకాళి బండ్‌-2 పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఉర్సు ట్యాంకు బండ్‌ పనులు ఇంతవరకు మొదలే కాలేదు.

* వరంగల్‌ తూర్పులో 11 స్మార్ట్‌ రోడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. సగం సగం రహదారులు, భూగర్భ మురుగు కాల్వలు, సెంట్రల్‌ డివైడర్లు, నడక దారులు, సుందరీకరణ తదితర పనులు పూర్తి కాలేదు.

* వరంగల్‌ పశ్చిమలో హనుమకొండ కొత్త బస్టాండ్‌, ఎన్జీవోస్‌ కాలనీ స్మార్ట్‌ రోడ్డు పనులు మధ్యలో వదిలేశారు.

పట్టణ ప్రగతికి ఢోకా లేదు

పట్టణ ప్రగతి ద్వారా గ్రేటర్‌ వరంగల్‌కు నెలకు రూ.7.23 కోట్లు రావాలి. కొన్ని నెలలుగా నిధులు విడుదల కాలేదు. 2023- 24 వార్షిక పద్దులో పల్లె, పట్టణ ప్రగతి అమలు కోసం నిధులు కేటాయించారు. 2019 కొత్త పురపాలక చట్టం ప్రకారం పట్టణాల జనాభా ప్రతిపాదికన నిధులు కేటాయిస్తారు. ఈ ఏడాది నగరపాలిక, పురపాలికలకు నిధులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

వరద ప్రవాహ కాల్వలకు రూ.30 కోట్లే

వరంగల్‌ను ముంపు నుంచి తప్పించేందుకు వరద ప్రవాహ కాల్వలు(స్ట్రార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ) చాలా అత్యవసరం.  హనుమకొండ నయీంనగర్‌, పోచమ్మకుంట, రంగంపేట, అలంకార్‌, కాకతీయ కాలనీల్లో వరద ప్రవాహ కాల్వలకు నిధులు కావాలి. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పనులు సాగుతున్నాయి. కొత్తగా వీటి నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులు ఏమాత్రం సరిపోవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా విస్తరణ, అభివృద్ధి పనులకు రూ.147 కోట్లతో డీపీఆర్‌ సిద్ధంగా ఉంది. ప్రజాప్రతినిధులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడితే కనీసం ఈ నాలాకు నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని