logo

Warangal: అమ్మా నన్ను వీడి వెళ్లావా.. నీ ఒడిలోనే ఉంటా!

అనారోగ్యంతో ఉన్న కొడుకును చూసి తట్టుకోలేక ఆ తల్లి తనువు చాలించింది. అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె చెంతకే కుమారుడు చేరారు. కొద్ది గంటల తేడాతో తల్లి కొడుకుల మృతి గ్రామంలో శోకాన్ని మిగిల్చింది. 

Updated : 08 Mar 2023 09:41 IST

గంటల వ్యవధిలో తల్లీకుమారుడి మృతి

స్వామి, రాధమ్మ

చెన్నారావుపేట(నర్సంపేట), న్యూస్‌టుడే: అనారోగ్యంతో ఉన్న కొడుకును చూసి తట్టుకోలేక ఆ తల్లి తనువు చాలించింది. అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె చెంతకే కుమారుడు చేరారు. కొద్ది గంటల తేడాతో తల్లి కొడుకుల మృతి గ్రామంలో శోకాన్ని మిగిల్చింది.  వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..  అన్నబోయిన కొమ్మాలు, రాధమ్మ(60) దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. వారిద్దరికీ వివాహాలయ్యాయి. కుమారుడు స్వామి(45) బతుకుదెరువు కోసం నర్సంపేటలో స్థిరపడ్డారు. స్వామి కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివారం రాధమ్మ భర్త కొమ్మాలుతో కలిసి కుమారుడిని పరామర్శించడానికి నర్సంపేట వెళ్లారు. స్వామిపై తల్లి రాధమ్మ పడి ఏడుస్తున్న క్రమంలో అధిక రక్తపోటుతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మృతిచెందారు.

తల్లి మరణ వార్త విన్న స్వామి బంధుమిత్రులతో మాట్లాడుతూ.. ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు నా తల్లి అంత్యక్రియలను మీరు దగ్గరుండి చూసుకోవాల’ని బంధువులకు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. రాధమ్మ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో స్వామి మనోవేదనకు గురై ‘అమ్మా నీ ఒడికే వస్తున్నానంటూ’ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మృతిచెందారు. స్వామి ఆకస్మిక మరణంతో భార్య, కొడుకు, కోడలు కుమార్తె రోదనలు మిన్నంటాయి. తల్లికి తలకొరివి పెట్టాల్సిన కుమారుడు కూడా తల్లి చెంతకే చేరడం, ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి జరగడంతో పాపయ్యపేట గ్రామం మొత్తం కన్నీటిసంద్రమైంది. స్వామికి ఆయన కుమారుడు, రాధమ్మకు ఆమె కుమార్తె దహన సంస్కరణలు నిర్వహించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని