logo

అత్యవసర సేవలు ఇక వేగవంతం

ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్యవిభాగం అందుబాటులోకి రావడం వల్ల అత్యవసర రోగులకు సత్వర సేవలందనున్నాయి. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్య విభాగంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఐదు సీట్లను మంజూరు చేసింది.

Published : 01 Apr 2023 04:11 IST

ఎంజీఎం ఆసుపత్రికి ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్య విభాగం మంజూరు  

మాట్లాడుతున్న ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్యవిభాగం అందుబాటులోకి రావడం వల్ల అత్యవసర రోగులకు సత్వర సేవలందనున్నాయి. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్య విభాగంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఐదు సీట్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో మొదట ఎమర్జెన్సీ మెడిసిన్‌ సేవలందించే ఆసుపత్రుల జాబితాలో వరంగల్‌ ఎంజీఎం సైతం నిలవనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌తో పాటు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ వైద్యవిభాగం ఉంది. ఆ తర్వాత వరంగల్‌లోనే రానుందని అధికారులు తెలిపారు. ఈ వైద్య విభాగం రావడం వల్ల ప్రస్తుతం ఎంజీఎం అత్యవసర విభాగంలో అందుతున్న సేవల్లో వేగం పెరగనుంది.

ప్రస్తుతం ఇలా..

ప్రస్తుత విధానంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ఎంజీఎంకు వస్తే క్యాజువాలిటీలో ఉన్న వైద్యులు మొదట చూస్తారు. రోగికి అయిన గాయాలను బట్టి అతనికి అవసరమైన వైద్యసేవలను అందించడానికి న్యూరో, కార్డియాలజీ, మెడికల్‌ సర్జీకల్‌ తదితర వైద్యవిభాగాల వైద్యులకు సమాచారం అందిస్తే విధుల్లో ఉన్నవారు వచ్చి చికిత్స అందిస్తారు.

ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్య విభాగం అందుబాటులోకి వస్తే..

ఆయా వైద్యవిభాగాల వైద్యులను పిలిపించకుండానే రోగికి అవసరమైన వైద్యసేవలను ఆవిభాగంలో ఉన్న వైద్యులు అందిస్తారు. ఇందులో క్లిష్టమైన అత్యవసర సేవలన్నీ అందుతాయి. జాతీయ రహదారుల్లో జరిగే ఘోర ప్రమాదాల బాధితులకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సేవలందించే అవకాశం ఉంటుంది. ట్రామా సేవలు, ఇతర అత్యవసర ఆరోగ్య సంరక్షణ, క్లినిక్‌ చికిత్సలు అందించడానికి 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. ఫలితంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పేద రోగులకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.

త్వరలో ఎంజీఎంలో సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభం

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: మరో రెండునెలల్లో ఎంజీఎం, కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అధునాతన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకరావడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఆయన పదవి చేపట్టి ఏడాదైన సందర్భంగా ఆయన చేసిన ప్రగతిని విలేకరులకు వివరించారు. ప్రత్యేక వయోవృద్ధుల ఓపిలో 51వేలమందికి, ట్రాన్స్‌జెండర్‌ ఓపిలో 211మందికి సేవలందించామని తెలిపారు. కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో 2300 మందికి యాంజియోగ్రామ్స్‌, 462 స్టంట్లు వేశామని, 20 ఓపెన్‌హర్ట్‌ సర్జరీలు చేశామన్నారు. 285మందికి మోకాలుచిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తిచేశామన్నారు. హెపటైటిస్‌ క్లినిక్‌ ద్వారా 3500మందిని పరీక్షలు జరిపారు. 1966 క్యాన్సర్‌ బాధితులకు ఆపరేషన్లు జరిపామని పేర్కొన్నారు. రెండు నెలలో ఎంజీఎంలోని ఎంసీహెచ్‌ భవనంలో సంతానసాఫల్య కేంద్రం సేవలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నెఫ్రాలజీ విభాగంలో ఐదు పీజీ సీట్లు మంజూరైనందున త్వరలో కిడ్నిమార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతాయాన్నరు. హిమటాలజీ, చెవి ముక్కు గొంతు విభాగంలో అధునాతన సేవలు ప్రారంభం చేయడానికి కృషిచేస్తున్నామన్నారు.  రూ.10కోట్లతో నూతన ఎంఆర్‌ఐ స్కానింగ్‌ నెదర్లాండ్స్‌ నుంచి తెప్పిస్తున్నట్లు తెలిపారు. రెండువారాల్లో ఎంజీఎంలో ప్రత్యేక మధుమేహ వ్యాధిగ్రస్తులకు చికిత్స కేంద్రం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించడంలో ఆర్‌ఎంవోలు, అన్ని వైద్యవిభాగాల అధికారులు, స్టాప్‌నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సహకారంతో 70శాతం విజయం సాధించామని వివరించారు. ఈసమావేశంలో ఆర్‌ఎంవోలు డాక్టర్‌ మల్లికార్జున్‌, డాక్టర్‌ మురళి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని