logo

చల్లచల్లగా.. పైకప్పు విధానం!

గతంలో ఇళ్ల పైకప్పులపై చల్లదనం కోసం చెట్ల కొమ్మలు, కొబ్బరి మట్టలు, తాటికమ్మలు, మట్టిగూన పెంకులు వేసుకునేవారు.

Published : 27 Apr 2023 03:46 IST

జనగామలో ఓ భవనం పైకప్పు మీద పెయింట్‌ వేస్తున్న కార్మికుడు

జనగామ, న్యూస్‌టుడే: గతంలో ఇళ్ల పైకప్పులపై చల్లదనం కోసం చెట్ల కొమ్మలు, కొబ్బరి మట్టలు, తాటికమ్మలు, మట్టిగూన పెంకులు వేసుకునేవారు. ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చల్లదనం కోసం కొత్త సాంకేతిక రీతులను అనుసరిస్తున్నారు.

దేశంలోనే తొలిసారిగా..

ఈ పరిస్థితుల్లో.. ఇంధన పొదుపుతో పాటు, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ‘చల్లని పైకప్పు (2023-2028) విధానాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 300 చ.కి.మీ చలువ పైకప్పు ఏర్పాటే లక్ష్యం.

వీటికి తప్పనిసరి: 600 చదరపు గజాలు, అంతకు మించి విస్తీర్ణం కలిగిన స్థలంలో నిర్మించే నివాస భవనాలు, ప్రభుత్వ భవనాలు, స్థల విస్తీర్ణం, నిర్మిత పరిమాణం(బిల్టప్‌ ఏరియా)తో సంబంధం లేకుండా అన్ని నివాసేతర, వ్యాపార, వాణిజ్య భవనాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలయ్యే అన్ని గృహనిర్మాణ పథకాలకు ఈ విధానం వర్తిస్తుంది.

ఎవరికి ఐచ్ఛికం?: సౌర విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ ఉన్న భవనాల్లో చలువ కప్పు విధానాన్ని అనుసరించవచ్చు. రానున్న మూడేళ్లలో అన్ని నివాసేతర భవనాలకు వర్తింపజేస్తారు. ప్రస్తుతం ఈ విధాన పరిధిలోకి భవనాల యజమానులు చలువ పైకప్పుతో ఒనగూరే ప్రయోజనాలు పొందేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు.

టీఎస్‌బీపాస్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు

నిర్మాణ అనుమతులు పొందేందుకు అమలవుతున్న టీఎస్‌బీపాస్‌ సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు ఉంటాయి. నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మించే వారు చలువ పైకప్పు విధానాన్ని అనుసరించినట్లు రుజువులు చూపిన తరువాతే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేసేలా నిబంధనలు రూపొందించారు.  ఈ నెల ఒకటి నుంచి ఈ విధానం అమలులోకి వచ్చినట్లు పురపాలక శాఖ ప్రకటించింది. 2023-24కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలికలు, నగర పాలికలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సిమెంటు కాంక్రీటుతో నిర్మించే భవనాల పైకప్పులు త్వరగా వేడెక్కుతాయి. దీంతో ఇంటిలోపల వేడి ప్రభావం ఉంటుంది. దీన్ని తట్టుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరుగుతోంది. చలువ పైకప్పు విధానంలో స్లాబుపైన తెల్లని  రంగు వేస్తారు. ప్రస్తుతం  లైమ్‌వాష్‌/ఆక్రిలిక్‌ పాలిమర్‌/ప్లాస్టిక్‌ సాంకేతికతతో కూడిన తెల్ల రంగు(పెయింట్‌)ను పూస్తున్నారు. పాలీవినైల్‌క్లోరైడ్‌ విధానం అందుబాటులో ఉందని, సిరామిక్‌ మొజాయిక్‌, ఆల్బిడో టైల్స్‌ను పరిచే విధానం నగరాల్లో ఉందని భవన నిర్మాణదారులు చెబుతున్నారు. చలువ పైకప్పులు వేడిమిని తక్కువగా గ్రహిస్తాయని, సాధారణ పైకప్పుల కంటే, ఇవి 80 శాతం మేర సూర్యకిరణాలను పరావర్తనం చెందిస్తాయని పేర్కొన్నారు.


అమలుకు చర్యలు
-ఆర్‌.వీరస్వామి, టీపీవో, డీటీసీపీవో, జనగామ

చలువ పైకప్పు విధానానికి సంబంధించి ప్రాథమిక ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి స్థాయి ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలు, వ్యాపార సముదాయాలకు కూల్‌రూఫ్‌ నిబంధన వర్తిస్తుంది. చలువ పైకప్పునకు ఎలాంటి సాంకేతికత అనుసరించాలి.. తదితర అంశాలకు సంబంధించి త్వరలో పూర్తి సమాచారం అందుతుందని భావిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు