చిన్నారుల ఆరోగ్యానికి ‘సాక్షం’
అంగన్‌వాడీ కేంద్రాల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ‘సాక్షం’ పథకాన్ని అమలు చేస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు
న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్: అంగన్‌వాడీ కేంద్రాల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ‘సాక్షం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచిన్ గార్డెన్లు, శుద్ధజలం అందించే యంత్రాలు, ఎల్‌ఈడీ టీవీలు, ఇంకుడు గుంతల నిర్మాణం ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పోషకాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాయి. బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య సూచనలు, సలహాలు తెలపడం, చిన్నారులకు అటపాటలతో అక్షరాలు గుర్తుపట్టి చిన్నచిన్న పదాలు చదవడం, రాయడం నేర్పించేలా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. తాజాగా మరో అడుగు ముందుకేసి కొత్త పథకం అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాల ఎంపిక పూర్తి చేశారు. సొంత భవనం ఉండి కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు అనువైన స్థలం ఉన్నటువంటి కేంద్రాలను ఎంపిక చేశారు.
సిద్ధమైన ప్రతిపాదనలు
సాక్షం పథకం ద్వారా జిల్లాలోని ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. అందులో భాగంగా కాటారం మండలంలో 6, మల్హర్‌రావు-3, పలిమెల-3, మహాముత్తారం- 6, మహదేవ్‌పూర్-3, భూపాలపల్లి-7, చిట్యాల- 3 మొత్తం 31 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషన్ వాటిక కార్యక్రమం ద్వారా కిచెన్‌గార్డెన్ పెంచనున్నారు. కూరగాయలు, ఆకు కూరలను పండించేలా ప్రణాళిక తయారు చేశారు. భూపాలపల్లి మండలంలో 1, చిట్యాల-5, గణపురం-1, మొగుళ్లపల్లి-7, రేగొండ-10, టేకుమట్ల-5, మహాముత్తారం-2, మహదేవ్‌పూర్-4, కాటారం-10, మల్హర్‌రావు-4, పలిమెల-1 చొప్పున మొత్తం 50 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. భూపాలపల్లి-1, చిట్యాల-5, గణపురం-1, కాటారం-10, మహదేవ్‌పూర్-4, మహాముత్తారం-2, మల్హర్‌రావు- 5, మొగుళ్లపల్లి-7, రేగొండ-10, టేకుమట్ల-5 ఇలా మొత్తం 50 అంగన్‌వాడీ కేంద్రాల్లో శుద్ధ జలం అందించే ఆర్వో యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే భూపాలపల్లి-1, చిట్యాల- 1, గణపురం-1, కాటారం-3, మహదేవ్‌పూర్-1, మహాముత్తారం-1, మొగుళ్లపల్లి-1, రేగొండ-2, టేకుమట్ల-1 ఇలా 12 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే భూపాలపల్లి-1, చిట్యాల-5, గణపురం-1, కాటారం-10, మహదేవ్‌పూర్-4, మహాముత్తారం-2, మల్హర్‌రావు-5, మొగుళ్లపల్లి-7, రేగొండ-10, టేకుమట్ల-5 కేంద్రాలు జిల్లావ్యాప్తంగా మొత్తం 50 కేంద్రాల్లో అవసరమైన చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
- శైలజ, జిల్లా ఇన్‌ఛార్జి సంక్షేమాధికారి
సాక్షం పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఇంకుడు గుంతల నిర్మాణానికి జిల్లా స్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ, కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటుకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. అలాగే నీటి శుద్ధి యంత్రాలు(ఆర్వో ప్లాంటు), ఎల్‌ఈడీ టీవీల పంపిణీ రాష్ట్ర కమిషనరేట్ నుంచి పంపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.