logo

ఐటీఐల్లో ప్రవేశం.. ఉపాధికి ఊతం !

దేశ ఆర్థిక వ్యవస్థలో ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌(ఐటీఐ)లు ముఖ్య పాత్ర  పోషిస్తున్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తున్నాయి.

Updated : 07 Jun 2023 05:35 IST

జనగామలోని ఐటీఐ కళాశాలలో సాంకేతిక ప్రయోగం చేస్తున్న విద్యార్థులు (పాతచిత్రం)

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: దేశ ఆర్థిక వ్యవస్థలో ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌(ఐటీఐ)లు ముఖ్య పాత్ర  పోషిస్తున్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఐటీఐల్లో చదివితే స్వయం ఉపాధితో పాటు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలోని పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేందుకు ఐటీఐ విద్య దోహదపడుతోంది. జిల్లాలోనూ సాంకేతిక విద్యకు డిమాండ్‌ అధికంగా ఉంది. రెండేళ్ల ఐటీఐ కోర్సు పూర్తి చేసిన తరువాత అప్రెంటిస్‌ పూర్తి చేస్తే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. వీటిలో మొదటి విడత ప్రవేశాల కోసం జూన్‌ 10వ తేదీ వరకు అంతర్జాలంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

భవితకు భరోసా..!

జనగామ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏడు ఐటీఐ కళాశాలలున్నాయి. జనగామలో 3, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లిలో 2, పాలకుర్తిలో 1, బచ్చన్నపేటలో 1 ఉన్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీవీటీ) ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు (సాంకేతిక విద్యాశాఖ) అంతర్జాలం ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని పలు ఐటీఐల్లో ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, సివిల్‌, డీజిల్‌, మెషినింగ్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటికి డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఆయా కోర్సుల వైపే మొగ్గు చూపుతుంటారు. మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది కూడా జిల్లాలో పదో తరగతిలో చాలా మంది 10 జీపీఏ సాధించారు. దీంతో ఉన్నత విద్యకు ప్రామాణికమైన ఇంటర్‌లో చేరాలనుకునే వారు తరగతుల ప్రారంభం నాటికి ఐటీఐల్లో చేరుతుండడం గమనార్హం. ఐటీఐ ద్వారా ఉద్యోగావకాశాలు మెండుగా ఉండడంతో చాలామంది ఇందులో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు.

దరఖాస్తు విధానమిలా..

  ఐటీఐలో ప్రవేశం కోసం http://iti.telangana.gov.in లో లాగిన్‌ కావాలి. కుడివైపున విద్యార్థి లాగిన్‌ ఓపెన్‌ చేయాలి. కొత్త రిజిస్ట్రేషన్‌ క్లిక్‌ చేసిన తరువాత చరవాణి నెంబర్‌, మెయిల్‌ ఐడీ నమోదు చేసి సబ్మిట్‌పై నొక్కాలి.  చరవాణి నెంబర్‌కు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ వస్తాయి. వాటి ఆధారంగా తెరచి వివరాలు నమోదు చేసుకోవాలి. పదో తరగతి, కుల ధ్రువీకరణపత్రం, ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివిన ఆయా పాఠశాలల బోనఫైడ్‌ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ ఐటీఐలు ఉన్నాయి.. అక్కడ ఏయే కోర్సులు ఉన్నాయన్న పూర్తి వివరాలను అంతర్జాలంలో పొందుపరిచారు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి 14 ఏళ్లు నిండిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐటీఐలో ప్రవేశాల వివరాలు తెలుసుకోవాలనుకునే వారు 98668 43920 నెంబర్‌లో సంప్రదించాలి.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

బి.హరికృష్ణ, జనగామ, యాదాద్రి జిల్లాల ఐటీఐ విభాగం కన్వీనర్‌

ఐటీఐలో ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఐటీఐలో చేరి వెంటనే ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని