logo

వరుడి నిజస్వరూపం తెలిసిపోయింది.. ప్రియురాలి ఫిర్యాదుతో పీటలపై ఆగిన పెళ్లి!

కొన్ని నిమిషాల్లో పచ్చని  పందిరిలో పెళ్లి జరగాల్సి ఉంది.. ఇంతలో వరుడి అసలు నిజస్వరూపం తెలిసింది. పోలీసుల రంగ ప్రవేశంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది

Updated : 15 Jun 2023 07:36 IST

  

కమలాపూర్‌, న్యూస్‌టుడే: కొన్ని నిమిషాల్లో పచ్చని  పందిరిలో పెళ్లి జరగాల్సి ఉంది.. ఇంతలో వరుడి అసలు నిజస్వరూపం తెలిసింది. పోలీసుల రంగ ప్రవేశంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం బోధన్‌పల్లి గ్రామానికి చెందిన ఏటకారి సాయి(27) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే మండలంలోని ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా చనువుగా తిరిగి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. నాలుగు నెలల గర్భవతి కావడంతో గర్భవిచ్ఛితి చేయించాడు. వీరి ప్రేమ విషయం ఇరువురి కుటుంబాలకు తెలిసింది.. అప్పటి నుంచి సాయి మాట్లాడటం లేదు.

ఆమెకు తెలియకుండా హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రేమికురాలు.. అతన్ని నిలదీయడంతో గత నెల 28న పసుపుతాడు కట్టాడు. మరుసటి రోజు నువ్వు నాకు అవసరం లేదంటూ బెదిరించి వెళ్లిపోయాడు. ఆమె కౌటాల పోలీసు స్టేషన్‌లో ఈనెల 12న ఫిర్యాదు చేయడంతో యువకుడిపై అత్యాచారం, బెదిరింపుతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం సాయి వివాహం జరుగుతుందని అమ్మాయి పోలీసులకు తెలపడంతో కౌటాల ఎస్సై విజయ్‌, సిబ్బంది హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని గ్రామానికి వచ్చారు. కమలాపూర్‌ ఎస్సై మోటం సతీశ్‌ సహకారంతో పెళ్లింటికి వెళ్లారు. పోలీసులు రాకను గుర్తించిన సాయి.. ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకొని చనిపోతానంటూ బెదిరించాడు. కొద్దిసేపటికి పోలీసులు లోపలికి ప్రవేశించి వధువు కుటుంబీకులతో మాట్లాడారు. అసలు విషయం చెప్పడంతో వారు పెళ్లిని రద్దు చేశారు. సాయిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని