logo

రైళ్ల రద్దు.. ‘ప్యాసింజరు’కు కష్టాలు

రెండు నెలలుగా ప్యాసింజరు రైళ్లు (ఇప్పుడు వీటిని ఎక్స్‌ప్రెస్‌లుగా పిలుస్తున్నారు) నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 19 Aug 2023 07:24 IST

రెండు నెలలుగా ప్యాసింజరు రైళ్లు (ఇప్పుడు వీటిని ఎక్స్‌ప్రెస్‌లుగా పిలుస్తున్నారు) నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ పనులు,  ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్లేవారికి చౌక ప్రయాణ సాధనాలుగా ఇవి ఉండేవి. మూడోలైను పనులను కారణంగా చూపుతూ ఏడాది కాలంగా అనేక రైళ్లను రద్దు చేస్తూ వస్తున్నారు. ఈ ప్రకటనలు చివరి నిమిషంలో విడుదల చేస్తుండడంతో సమాచారం సైతం ప్రయాణికులకు తెలియడం లేదు. కొత్త పట్టాలు వేయడానికి నెలలకొద్ది జాప్యం చేస్తుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేసేదేం లేక రోజువారీ ప్రయాణికులు రోడ్డు మార్గంలో ఇతర రవాణా సాధనాలను ఆశ్రయిస్తున్నారు. ఇది రైల్వేకు భవిష్యత్తులో ప్రమాదకరంగానూ మారవచ్చు.  

న్యూస్‌టుడే, కాజీపేట

‘జూన్‌ 18 నుంచి క్రమంగా రామగిరి, బల్లార్షా, డోర్నకల్‌, సింగరేణి, హైదరాబాద్‌ పుష్‌పుల్‌ రైళ్లను రద్దు చేస్తూ ప్రతి రెండు వారాలకు ఒకసారి దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు రద్దు గడువు ఉంది. ఇప్పటికైనా వీటిని పునరుద్ధరిస్తారా లేదా అని ప్రయాణికులు వేచి చేస్తున్నారు. శుక్రవారం వరకు రైల్వే నుంచి ఏ ప్రకటనా రాలేదు’

జీవితాలతో ముడిపడి:  చౌకగా, సుఖంగా, తక్కువ సమయంలో గమ్యం చేర్చే ప్యాసింజరు రైళ్లు ప్రయాణికుల జీవితాలతో ముడిపడి ఉంటాయి. పేదలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అమ్ముకునే చిరువ్యాపారులు ఎక్కువగా వీటిపై ఆధారపడతారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను కాకుండా కేవలం ప్యాసింజరులనే రద్దు చేయడం వెనుక రహస్యం తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం సౌకర్యవంతంగా రామగిరి..

రోజూ ఉదయం బల్లార్షా మార్గంలో కాజీపేట నుంచి ప్రయాణికులు వెళ్లడానికి రామగిరి అత్యంత అనువైనది. దీని తర్వాత ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నా ఉదయం 9 గంటలలోపు జమ్మికుంట, ఓదేల, మంచిర్యాల, రామగుండం ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా ఉంటుంది. పనులు పూర్తి చేసుకుని సాయంత్రం కాగజ్‌నగర్‌ లేదా, సింగరేణికి తిరిగి రావొచ్చు. రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు వెళ్లడానికి రోడ్డు మార్గంలో రెండు మూడు బస్సులు మార్చాల్సి ఉంటుంది. ఇది ప్రయాణికులకు దూరాభారం.

రామా.. ఇవేమి ప్రయోగాలు..

బల్లార్షా మార్గంలోని ప్రయాణికులు భద్రాచలం, కొత్తగూడెం వెళ్లడానికి ఒకే ఒక రైలు సింగరేణి ఎక్స్‌ప్రెస్‌. దీని మీద రైల్వే మొదటి నుంచీ ప్రయోగాలు చేస్తోంది. ముందుగా  బల్లార్షా నుంచి కాజీపేట రైల్వే స్టేషన్‌కు వచ్చి భద్రాచలం రోడ్డుకు వెళ్లేది. దీంతో ఆలస్యం అవుతుందని కాజీపేట వంతెన కింద కాజీపేట టౌన్‌ రైల్వే స్టేషన్‌ను నిర్మించి అక్కడి నుంచే రైలును నేరుగా వరంగల్‌ మీదుగా భద్రాచలం రోడ్డుకు పంపుతున్నారు. దీనికి మామూలుగా ప్యాసింజరు రైలు కోచ్‌లు ఉండేవి. వాటిని తొలగించి పుష్‌పుల్‌గా మార్చారు.  దూర ప్రాంత రైలు కాబట్టి   ప్రయాణికుల వినతి మేరకు రెండు మూత్రశాలలు ఏర్పాటు చేశారు. తర్వాత బల్లార్షా మార్గంలో ఏ చిన్న పనులు జరిగినా ఈ రైలును రద్దు చేస్తూ వస్తున్నారు. భద్రాచలం వెళ్లడానికి బల్లార్షా మార్గంలో ప్రయాణికులు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి డోర్నకల్‌ లేదా ఖమ్మం, విజయవాడకు వెళ్లి అక్కడ నుంచి భధ్రాచలం వెళుతున్నారు. వీరి కష్టాలు రాముల వారికే తెలియాలి.

సికింద్రాబాద్‌ పుష్‌పుల్‌ లేక ఇబ్బందులు

వరంగల్‌ నగరం నుంచి రోజూ మధ్యాహ్నం సికింద్రాబాదు వెళ్లడానికి పుష్‌పుల్‌ చాలా అనువైన చౌకైన రైలుగా ఉండేది. ఇప్పుడు ఉదయం మాత్రమే నడుపుతూ మధ్నాహ్నం రద్దు చేయడం వల్ల రాజధానిలో ఉద్యోగాలు చేసుకునే వారు వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారు. పుష్‌పుల్‌ రైలులో సికింద్రాబాదు వెళ్లడానికి రూ.60 మాత్రమే. బస్సుల్లో రూ.350 వరకు పెట్టి వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.

  • ఈ విషయంపై రైల్వే అధికారులతో మాట్లాడగా.. బల్లార్షా, విజయవాడ మార్గంలో కొత్తగా రైలు పట్టాలను నిర్మిస్తున్నందున ఈ సమస్య ఉత్పన్నమౌతోందని చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారులకు విన్నవించామని.. త్వరలో రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉందని తెలిపారు. 

ప్రయాణికుల కష్టాలు గుర్తించరా..

ప్యాసింజరు రైళ్లు రద్దు చేసినప్పుడు ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. చిన్న రైల్వే స్టేషన్లలో ఇవి ఆగవు కాబట్టి అక్కడి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రైల్వే స్టేషన్లకు కూడా ప్రాధాన్యం లేకుండా పోతోంది. రైళ్లు ఆగనప్పుడు అవి ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది.

ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యులు

ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలి..

నేను రోజూ ఓదెల నుంచి కాజీపేట, వరంగల్‌కు వస్తుంటాను.  ఓదెలలో ఆగే ప్యాసింజరు రైల్లు రెండు నెలలుగా రద్దు చేస్తున్నారు.  కాజీపేటకు రావడానికి మంచిర్యాల లేదా రామగుండం, పెద్దపల్లికి వెళ్లి అక్కడ నుంచి ఎక్స్‌ప్రెస్‌ బస్సుల ద్వారా రావాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రయాణికుల సమస్య తీర్చాలి.

కలవేని శ్రీనివాసు ఓదేల ప్రయాణికుడు
 

అజ్నీ ప్యాసింజరులో (బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు