logo

అమాయకులకు సైబర్‌ ఉచ్చు..

ఉమ్మడి జిల్లాలో సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు.

Published : 28 Mar 2024 04:18 IST

న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం

  • వరంగల్‌ మట్టెవాడ ఠాణా పరిధిలో ప్రైవేటు ఉద్యోగి చరవాణికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి వాట్సప్‌,  టెలిగ్రామ్‌కు పంపిన సందేశానికి స్పందించి రూ.2.32 లక్షలు మోసపోయాడు. హోటల్‌కు రేటింగ్‌ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు.
  • గతంలో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి మాటల్లోకి దించి.. చరవాణికి వచ్చే ఓటీపీలను తెలుసుకొని మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు లింక్‌లను పంపించి మోసాలు చేస్తున్నారు.  

మ్మడి జిల్లాలో సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు. కొందరు అమాయకులు తమ చరవాణికి వచ్చిన లింకులు తెరవడం ద్వారా చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత స్థాయి ఉద్యోగులు సైతం సైబర్‌ కేటుగాళ్ల చేతుల్లో మోసపోయి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు.

మార్ఫింగ్‌ చేసి.. 

  • సైబర్‌ నేరగాళ్లు ఎంపిక చేసుకున్న వ్యక్తుల చరవాణులు, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రామ్‌లకు లింకులు పంపి.. అందులో ఉన్న వ్యక్తిగత ఫొటోలను సేకరిస్తారు. వాటిని మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు శ్రుతి మించి కుటుంబ సభ్యులకు కూడా పంపిస్తుండడంతో వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయి.  
  • నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి చరవాణికి ఓ బ్యాంకు పేరుతో వచ్చినట్లు లింకు పంపించారు. దానిపై క్లిక్‌ చేయగానే ప్రభుత్వ ఉద్యోగి చరవాణిలో ఉన్న సమాచారం అంతా సైబర్‌ మోసగాడి చేతుల్లోకి వెళ్లింది. కొద్దిరోజుల తర్వాత ఆ ఉద్యోగి ఓ మహిళతో ఉన్నట్లు చరవాణికి ఫొటోలు వచ్చాయి. మోసగాళ్లు చెప్పిన యూపీఐ ఐడీకి రూ.2 లక్షలు పంపించినా ఇంకా.. డిమాండ్‌ చేయడంతో ఏకంగా ఫోన్‌ నెంబరు మార్చుకున్నారు.


లింక్‌లతో ఎర

సైబర్‌ నేరగాళ్లు చరవాణిలోని వ్యక్తిగత సమాచారం తెలుసుకునేందుకు ఫిషింగ్‌ లింక్స్‌ను పంపించి ఎర వేస్తున్నారు. లింక్‌లు అచ్చం ప్రముఖ సంస్థలు పంపినట్లుగా ఉంటున్నాయి. దీంతో చాలా మంది విద్యావంతులు కూడా స్పందించి వాటిని క్లిక్‌ చేయడంతో చరవాణిలో ఉన్న పూర్తి సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఫొటోలు, బ్యాంక్‌ ఖాతాల సమాచారం, వ్యక్తిగత వివరాలు, కాంటాక్టు నెంబర్లు వారికి చేరుతున్నాయి. కృత్రిమ మేధతో ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, అసభ్యకరమైన సందేశాలను జత చేసి ఇతరులతో ఉన్నట్లుగా మారుస్తున్నారు. వాటిని బాధితులకు పంపించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవ్వకుంటే బాధితుడి ఫోన్‌ నెంబర్ల లిస్టులో ఉన్నవారికి ఆ ఫొటోలు పంపిస్తున్నారు.

కేయూ ఠాణా పరిధిలోని ఓ వ్యాపారికి గుర్తు తెలియని వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రేెడింగ్‌ యాప్‌ పేరుతో లింక్‌ పంపించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని ఆశ చూపాడు. వారి మాటలు నమ్మిన వ్యాపారి రూ.40.67 లక్షలు అందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు.


అప్రమత్తంగా ఉండాలి..

- విజయ్‌కుమార్‌, ఏసీపీ, సైబర్‌ క్రైం విభాగం

గుర్తు తెలియని వ్యక్తులు, నెంబర్ల నుంచి చరవాణులకు వచ్చే లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫిషింగ్‌ లింక్స్‌ జోలికి వెళ్లొద్దు. సామాజిక మాధ్యమ ఖాతాలకు అపరిచితుల నుంచి రిక్వెస్టులు వస్తే అంగీకరించొద్దు. ఫేÆస్‌బుక్‌, ఎక్స్‌ ఖాతా, ఇన్‌స్టాగ్రాం వినియోగించే సమయంలో రెండు దశల ధ్రువీకరణను ఆన్‌ చేసుకుంటే ఇతరులు మన ఖాతాల్లోకి చొరబడేందుకు వీలు ఉండదు. వ్యక్తిగత చిత్రాలను సామాజిక మాధ్యమ ఖాతాల్లో వీలైనంత వరకు పోస్ట్‌ చేయకపోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని