logo

మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌ అలియాస్‌ మురళీ, ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌కు చెందిన సుమన అలియాస్‌ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి.

Published : 20 Apr 2024 01:55 IST

సిరిపెల్లి సుధాకర్‌, సుమన (పాత చిత్రాలు)

చిట్యాల, న్యూస్‌టుడే : ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌ అలియాస్‌ మురళీ, ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌కు చెందిన సుమన అలియాస్‌ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. 24 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన సుధాకర్‌ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అజ్ఞాతంలోనే రంజితను పెళ్లి చేసుకున్నారు. మంగళవారం ఆ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దంపతులు ఇద్దరూ మృతి చెందారు. బుధవారం రాత్రి కాంకేర్‌ వెళ్లిన సుధాకర్‌ తల్లి రాజపోచమ్మ, కుటుంబ సభ్యులు మార్చురీలో పలు ఆనవాళ్ల ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. సుధాకర్‌ మృతదేహంతో పాటు పోలీసుల అనుమతితో ఆయన భార్య రంజిత మృతదేహాన్ని కూడా చల్లగరిగెకు శుక్రవారం ఉదయం ఆంబులెన్స్‌లో తీసుకొచ్చారు. వారి మృతదేహాలకు అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు శాంతక్క, సభ్యులు శోభ, పౌరహక్కుల సంఘం సహాయ కార్యదర్శి కుమారస్వామి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్‌, విరసం నాయకుడు బాలసాని రాజయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ కొమురయ్య, దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌ తదితరులు ఎర్ర జెండాలు కప్పి నివాళులు అర్పించారు. స్థానిక జడ్పీటీసీ సభ్యుడు సాగర్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గూట్ల తిరుపతి మృతదేహాలను సందర్శించారు. అనంతరం గ్రామంలో సుధాకర్‌, రంజిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంతిమ యాత్ర నిర్వహించారు. గ్రామ శివారులో దంపతుల మృతదేహాలను ఖననం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లన్నీ బూటకమేనని అమరవీరుల బంధుమిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం నాయకులు తెలిపారు. మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్రంలోని సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా మావోయిస్టులను హతమారుస్తున్నారని తెలిపారు. వెంటనే ఈ చర్యలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

సుధాకర్‌, రంజిత మృతదేహాల వద్ద నివాళులు అర్పిస్తున్న వివిధ సంఘాల నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని