logo

కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!

భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది.

Published : 20 Apr 2024 02:05 IST

4 వేల ఎకరాలకుపైగా నోటిఫై చేస్తే అభయారణ్యం సాకారం
సుప్రీం తీర్పుతోనైనా అధికార యంత్రాంగం కదిలేనా?
ఈనాడు, వరంగల్‌, ధర్మసాగర్‌ (హనుమకొండ), న్యూస్‌టుడే

భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. ఇలాంటి సమస్యే హనుమకొండ జిల్లా అటవీ భూముల్లోనూ ఉంది. ధర్మసాగర్‌ మండలం ఇనుపరాతి గుట్ట చుట్టూ సుమారు 4 వేల ఎకరాల అటవీ భూముల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతున్నా అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ధారించడం లేదు. దీన్ని అభయారణ్యంగా ప్రకటించాలనే డిమాండు ఎన్నో ఏళ్లుగా ఉన్నా సాకారం కావడం లేదు.

కొన్నేళ్లుగా రెవెన్యూ, అటవీ శాఖలు కలిసి సర్వే పేరుతో కాలయాపన చేస్తుండడంతో హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ఇనుపరాతి గుట్ట చుట్టు ఉన్న వేలాది ఎకరాల అటవీ భూములను ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ పట్టాలు చేసుకుంటున్నారు. ఈ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఒక్క శాతం మాత్రమే. ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో అటవీ శాఖ భూములు ఉన్నాయి. నిజాం కాలంలో మొత్తం 4 వేల ఎకరాలకుపైగా భూమిని అటవీ శాఖకు అప్పగించినట్టు రికార్డుల్లో ఉంది. కాలక్రమంలో రెవెన్యూ అధికారుల తీరు వల్ల అటవీ భూమికి చుట్టుపక్కల పట్టాలు పుట్టుకొస్తున్నాయి. రెవెన్యూ అధికారులు కొందరు యథేచ్ఛగా సర్వేనెంబర్లకు బై నెంబర్లు వేసి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నారు. కొన్ని నెలల కిందట ఓ రెవెన్యూ అధికారి ఏకంగా 40 ఎకరాలకు పట్టాలు ఇచ్చేయడం విమర్శలకు దారితీసింది. ఈ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వీటిని రక్షించి నోటిఫై చేయాలని విశ్రాంత జిల్లా అటవీ అధికారి కాజిపేట పురుషోత్తం నేతృత్వంలో పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక స్వచ్ఛంద సభ్యులు గత కొన్నేళ్లుగా పెద్ద ఉద్యమమే చేస్తున్నారు.

ఎన్నో వన్యప్రాణులకు ఆవాసం

వైవిధ్యమైన ఔషధ మొక్కలు, ఎన్నో రకాల జీవజాతులకు ఈ అడవి ప్రసిద్ధిగాంచింది. ఎలుగుబంట్లు, జింకలు, కొండచిలువలు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలతోపాటు, అనేక రకాల పక్షి జాతులకు నిలయంగా ఉంది. ఓరుగల్లు నగరానికి ఈ అడవిని ఊపిరితిత్తులు (లంగ్స్‌ ఆఫ్‌ వరంగల్‌)గా పర్యావరణ ప్రేమికులు అభివర్ణిస్తారు.  ఇనుపరాతి గుట్టలు ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇవీ కొన్ని ఉదాహరణలు

అటవీ శాఖ రూపొందించిన బ్లాక్‌ మ్యాప్‌

  • ధర్మసాగర్‌ మండల పరిధిలోనే 150 ఎకరాలను 8 ఏళ్ల కిందట పలువురు తమ పేరిట  పట్టాలు చేసుకున్నా ఇప్పటికీ హద్దులు లేవు. ఇటీవల హద్దులను నిర్ణయించేందుకు రెవెన్యూ అధికారులు వస్తే వారిని దేవునూర్‌ గ్రామంలో కొందరు అడ్డుకుని వెనక్కి పంపించారు.  
  • మరో 30 ఎకరాల వరకు ముప్పారం, నారాయణగిరి శివారుల్లోని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి.
  • పల్లగుట్ట, చాకలిగుట్ట, ఎదురుగుట్ట, పంది అడుగు గుట్ట పరిధిలోని భూములు కబ్జా కోరల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో త్వరలో మరో 95 ఎకరాలను పట్టా చేయడానికి రంగం సిద్ధం చేశారు.
  • కొన్నేళ్లుగా ఈ భూములను పట్టాలు చేసుకుంటున్నవారిలో రియల్టర్లే ఉంటున్నారు. ఈ స్థలాల్లోని కొన్ని సర్వే నెంబర్లలో దశాబ్దాల కిందట కొందరు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం భూములను అసైన్‌ చేసింది. కనీసం రెవెన్యూ అధికారులు వీరు సాగు చేసుకునేందుకు హద్దులు నిర్ణయించి ఇవ్వడం లేదు.. కబ్జాదారులకు మాత్రం ముడుపులు తీసుకుని చకచకా పట్టాలు చేసేయడం గమనార్హం.
  • రెండేళ్ల కిందట అటవీ శాఖ అధికారులు తమ భూముల్లో మొక్కలు నాటాక కబ్జాదారులు వచ్చి వాటిని తొలగించి తమ పేర్లతో బోర్డులు నాటారు.
  • అక్రమంగా పట్టా అయిన భూములు అన్నీ గతంలో అటవీ శాఖ నుంచి వచ్చిన బ్లాక్‌ నెంబర్ల పరిధిలో ఉన్న భూములే కావడం గమనార్హం.

సర్వేకు ఇంకెన్నేళ్లు?

అడవిలో ఆక్రమణలు ఆపాలని ఇటీవల  క్షేత్రస్థాయికి వెళ్లిన పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక సభ్యులు, స్థానికులు

ఈ భూముల్లో ఇప్పటికే 500 ఎకరాలకుపైగా అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ క్రమంలో దేవునూరుతోపాటు, పరిసర గ్రామాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆక్రమణలపై పోరాటం చేశారు. ఈ భూములను సర్వే చేసి, రిజర్వు ఫారెస్టుగా గుర్తించాలని కొన్నేళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ, అటవీ శాఖ సంయుక్త సర్వే చేపట్టింది. సర్వే ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు ఆధునిక డిజిటల్‌ పరికరాలతో సర్వే చేసి ఏడాదిన్నర కిందట ఆ నివేదికను అటవీ శాఖ, జిల్లా యంత్రాంగానికి అప్పగించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అటవీ చట్టం సెక్షన్‌ 4 ప్రకారం సర్వే ఆధారంగా ఇనుపరాతిగుట్టల ప్రాంతాన్ని ‘రక్షిత అడవి’గా నోటిఫై చేయాల్సి ఉంది. సంయుక్త సర్వేలో అటవీ శాఖ భూములు 3,900 ఎకరాలుగా తేలింది. ఉన్న భూములను అభయారణ్యంగా నోటిఫై చేస్తే భవిష్యత్తులో ఆక్రమణలు ఉండవు.


సుదీర్ఘ పోరాట ఫలితం..

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే, భూపాలపల్లి : గత 39 ఏళ్లుగా వివాదంలో ఉన్న భూపాలపల్లి పట్టణం కొంపెల్లి గ్రామ శివారులోని 106 ఎకరాల భూములు అటవీ శాఖవేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమ  శాఖ చేసిన సుదీర్ఘ పోరాటానికి ప్రతిఫలం దక్కిందని అటవీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు వ్యక్తితో చేతులు కలిపి.. అధికారుల తప్పుడు నివేదికలు: ఆ భూమి అటవీశాఖదేనని స్పష్టంగా తెలుస్తున్నా.. ప్రైవేటు వ్యక్తితో చేతులు కలిపి కొందరు అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం  ప్రస్తావించింది. తప్పుడు, కుట్రపూరిత అఫిడవిట్లు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారి నుంచి ఖజానాకు జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని పేర్కొంది. అఫిడవిట్‌ సమర్పించిన ఓ ఉన్నతాధికారిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. తప్పుడు రికార్డులు సమర్పించిన, రికార్డులు తారుమారు చేసిన వారిపైనా విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. 1985 నుంచి ఇప్పటివరకు పలువురు అధికారులు ప్రైవేటు వ్యక్తికి సహకరించినట్లుగా తెలిసింది. విలువైన ఈ భూముల విషయంలో పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు సమాచారం. అవినీతికి పాల్పడి అప్పనంగా భూములు కట్టబెట్టే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈనాడు కథనంతో..

అటవీ భూముల కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వ్యవహారాలపై 2021 మార్చి 30న ‘ఈనాడు’ లో ‘అటవీశాఖ భూములకు ఎసరు ..?’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా అటవీ అధికారులు కదిలారు. ఆ భూములను దక్కించుకునేందుకు మళ్లీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తర్వాత వాదోపవాదనల అనంతరం రికార్డుల నివేదన తర్వాత సుప్రీం కోర్టు అటవీ శాఖకు సానుకూల తీర్పు ఇచ్చింది.


అక్రమ పట్టాలను తొలగించి నోటిఫై చేయాలి

కాజిపేట పురుషోత్తం, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, హనుమకొండ

అటవీ భూముల్లో అక్రమ పట్టాలపై విచారణ జరపాలి. అవకతవకలకు బాధ్యులైన రెవెన్యూ, అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి. సర్వే వెంటనే పూర్తి చేసి నోటిఫై చేసి కేంద్రానికి పంపితే రిజర్వు ఫారెస్టుగా గుర్తిస్తారు. అప్పుడే అడవికి ఆక్రమణల నుంచి రక్షణ కలుగుతుంది. లేదంటే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని చూస్తున్నాం.


ఎన్నికల తర్వాత సర్వే పూర్తి చేస్తాం

లావణ్య, జిల్లా అటవీ శాఖ అధికారిణి, హనుమకొండ

ధర్మసాగర్‌ పరిసర మండలాల్లోని అటవీ భూములపై గతంలో కొంతమేర సర్వే చేశారు. అది అసంపూర్తిగా ఉంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల విధుల్లో ఉన్నాం. అవి పూర్తయ్యాక రెవెన్యూ శాఖతో సంయుక్త సర్వే పూర్తిచేసి నోటిఫై చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని