logo

స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’

వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్‌ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్‌లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్‌ సర్కారులో ఫారెస్ట్‌లకు అసిస్టెంట్‌ క్యూరేటర్‌గా పనిచేశారు

Published : 23 Apr 2024 03:36 IST

 బి.ఏ.మీర్జా
మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్‌ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్‌లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్‌ సర్కారులో ఫారెస్ట్‌లకు అసిస్టెంట్‌ క్యూరేటర్‌గా పనిచేశారు. ఆ పదవికి రాజీనామా చేసి అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ)లో లేబర్‌ రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాలు చేసిన ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. 1962లో వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. సీపీఐ అభ్యర్థికి 1,12,572 ఓట్లు రాగా మీర్జాకు 1,13,308 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ అభ్యర్థి ఎస్‌.రామనాథంపై 736 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. 1967 జరిగిన నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. మీర్జాకు 1,19,346 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి ఎ.లక్ష్మీనారాయణకు 36,814 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 82,532 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రెండు సార్లు వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తండ్రి డాక్టర్‌ సఫ్దర్‌ అలిమీర్జా స్ఫూర్తిగా ఆయన ఉన్నత చదువులు చదివారు. బీఏ మద్రాస్‌లో చదివి ప్రముఖ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. విద్యావేత్తగా, విద్యార్థుల ప్రతినిధిగా వివిధ దేశాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బెంగాల్‌ జూట్‌ వర్కర్స్‌ యూనియన్‌లో పని చేసిన సమయంలో వారి కోసం ఉద్యమించి 1930లో అరెస్టయి జైలుకు వెళ్లారు. ఇస్తాంబుల్‌లోని ఇంటర్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యుడిగా వివిధ అంశాలపై ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, హాలండ్‌, డెన్మార్క్‌, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా రష్యా, మంగోలియాల్లో పర్యటించారు. హైదరాబాద్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ కమిషన్‌ సభ్యుడిగానూ పని చేశారు. సాహిత్య రంగంలోనూ రాణించి ‘భారత్‌’ ఆక్స్‌ఫర్డ్‌ మ్యాగజైన్‌కు సంపాదకుడిగా పనిచేశారు. వివిధ సామాజిక సమస్యలపై పలు వ్యాసాలు రాశారు.


 గీత దాటితే.. శిక్ష తప్పదు

మీకు తెలుసా..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తన నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేస్తోంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలకు తావులేకుండా చర్యలు తీసుకుంటోంది. మొత్తం పోలింగ్‌ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని, ఓటింగ్‌ జరగకుండా అడ్డుకోవడాన్ని బూత్‌ క్యాప్చరింగ్‌గా పిలుస్తారు. ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలను ధ్వంసం చేయడం, బ్యాలెట్‌ పేపర్లను స్వాధీనం చేసుకోవడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం వంటి చర్యలన్నీ బూత్‌ క్యాప్చరింగ్‌ పరిధిలోకి వస్తాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 135ఏ, 136 ప్రకారం 3 నుంచి 5ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951లోని సెక్షన్‌ 58ఏ ప్రకారం ఏదైనా పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ క్యాప్చరింగ్‌ జరిగితే ఎన్నికల సంఘం ఆ పోలింగ్‌ను నిలిపేయవచ్చు లేదా ఆ నియోజకవర్గంలో ఎన్నికలను పూర్తిగా రద్దు చేయవచ్చు.
- న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని