logo

నామపత్రాల జాతర..

వరంగల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు.

Published : 23 Apr 2024 03:44 IST

సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కావ్య చిత్రంలో పార్టీ నాయకులు

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస అభ్యర్థి మారపల్లి సుధీర్‌కుమార్‌.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్‌, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి సోమవారం నామపత్రాలను దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య.. వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి నామపత్రాలు అందజేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె నామపత్రాలు సమర్పించేంత వరకు కార్యాలయం బయటే వేచిచూశారు. అంతకుముందు భద్రకాళి ఆలయంలో కడియం కావ్య, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పూజలు చేశారు.

ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి హనుమకొండ గుండ్ల సింగారానికి చెందిన ఈసంపల్లి వేణు ఒకసెట్‌, ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థి మేకల సుమన్‌ గత శనివారం ఒకటి, సోమవారం మరోసెట్‌ నామపత్రాలను సమర్పించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మల్లంపల్లికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెదకొడపాకకు చెందిన మండ నరేశ్‌, హనుమకొండ పరకాలకు చెందిన బొచ్చు రాజు, వరంగల్‌ క్రిస్టియన్‌ కాలనీకి చెందిన పోగుల అశోక్‌ స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కో సెట్‌ సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థి హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన శనిగారపు రమేశ్‌బాబు రెండుసెట్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు 19 మంది అభ్యర్థులు 22 నామపత్రాలను దాఖలు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య తెలిపారు.

 మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

 నామపత్రాలను దాఖలు చేసిన తర్వాత  విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించే తనను ఎంపీగా గెలిపించాలన్నారు. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఐటీహబ్‌, ఎడ్యూకేషన్‌ హబ్‌గా వరంగల్‌ను తీర్చిదిద్దుతానన్నారు.  అనంతరం ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్‌ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

భారాస భారీ ర్యాలీ

బాలసముద్రం, వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి డాక్టర్‌ మారపెల్లి సుధీర్‌కుమార్‌ నామపత్రాల దాఖలు సందర్భంగా సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి బాలసముద్రంలోని భారాస జిల్లా పార్టీ కార్యాలయం నుంచి నక్కలగుట్టలోని వరంగల్‌ కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మార్గంమధ్యలో ఏకశిలా పార్కు దాటాక కొద్దిసేపు మాట్లాడారు. నామపత్రాలు సమర్పించిన అనంతరం మీడియా పాయింట్‌ వద్ద సుధీర్‌కుమార్‌ ప్రసంగించారు.  ప్రజలు తనను గెలిపిస్తే వరంగల్‌ జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరికి, భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌కు ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు.
ః మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా మచ్చలేని నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారిడిగా పేరొందిన డా.మారెపల్లి సుధీర్‌కుమార్‌కు భారాస పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశమిచ్చిందన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎలాంటి వారో.. ఎన్ని మోసాలు చేసిన వారో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌  డాక్టర్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ గ్రామీణ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని