logo

విన్నవించాం.. పరిష్కరించండి

ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ఫిర్యాదులు స్వీకరించారు

Published : 23 Apr 2024 03:51 IST

కలెక్టరేట్‌లో నిరీక్షిస్తున్న భూ నిర్వాసితులు
ములుగు, న్యూస్‌టుడే: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కారం లభించని వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వినతుల విషయంలో జాప్యం తగదని, పెండింగ్‌లో ఉంటే కారణాలను అర్జీదారులకు వివరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మొత్తం 18 దరఖాస్తులను స్వీకరించగా, ఎక్కువగా రెవెన్యూ, పింఛన్లకు సంబంధించినవి ఉన్నాయి. డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎ.అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తుల రవి, పౌరసరఫరాల శాఖ డీఎం రాంపతి, ఎల్డీఎం రాజ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి విజయచందర్‌ డీఈవో జి.పాణిని, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

భూములు కోల్పోయి దుర్భర జీవితం అనుభవిస్తున్నాం

 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ప్రభుత్వ అవసరాలకు తీసుకొని ప్రత్యామ్నాయం చూపకపోవడంతో భూములు కోల్పోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నామని గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన భూ నిర్వాసితులు తమ గోడును కలెక్టర్‌ ముందు వెళ్లబోసుకుంటున్నారు. ప్రజావాణికి సుమారు 37 మంది రైతులు వచ్చి బాధను వివరించారు. ‘చల్వాయి గ్రామ శివారులో 928, 928/ఏ సర్వే నెంబరులో  సుమారు 100 ఎకరాల భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాం. పోలీసు బెటాలియన్‌ ఏర్పాటుకు సాగు భూములు లాక్కున్నారు. భూమి స్వాధీనం చేసుకుని ఐదేళ్లయింది. భూములు ఇవ్వమని ఆందోళనలు చేశాం. అడ్డుకున్నందుకు కొందరిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. జీవనోపాధిని కోల్పోయిన తమకు ప్రత్యామ్నాయంగా సాయం చేయాలని’ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.


తాగునీటిని కొనుగోలు చేస్తున్నాం..
- జె.పోశాలు, వీవర్స్‌ కాలనీ, ములుగు

ములుగు పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో మిషన్‌ భగీరథ నీరు సరిగా రావడం లేదు. దీంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొనుగోలు చేసి నీళ్లు తాగాల్సిన పరిస్థితి నెలకొంది.


కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు..
- బి.లలిత, మల్లూరు, మంగపేట

ఏడాది క్రితం నా భర్త చనిపోయారు. వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇంత వరకు మంజూరు చేయలేదు. కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదు. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని