logo

‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’

న్యూ గ్రీన్‌ ఫీˆల్డ్‌ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు

Published : 23 Apr 2024 04:00 IST

 ఆర్‌ఐకు వినతిపత్రం ఇస్తున్న రైతులు

మొగుళ్లపల్లి, న్యూస్‌టుడే : న్యూ గ్రీన్‌ ఫీˆల్డ్‌ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా మంచిర్యాల జిల్లా నర్వ గ్రామం నుంచి హనుమకొండ జిల్లా ఊరుగొండ వరకు ఈ రహదారిని నిర్మించనుంది. మండలంలోని మొగుళ్లపల్లి, మేదరమెట్ల, ఇస్సిపేట, రంగాపూర్‌ గ్రామాల ద్వారా వెళ్తుండగా, ఆర్‌ఐ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పురుగు మందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేసి సర్వేను అడ్డుకున్నారు. తరతరాలుగా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నామని, భూమి పోతే జీవనోపాధి లేకుండా పోతుందని అన్నారు. మార్కెట్‌ రేటు ప్రకారం కాకుండా ప్రభుత్వ రేటు ప్రకారం భూములకు ధరలు నిర్ణయించడం రైతులను మోసం చేయడమేనన్నారు. ఆర్‌ఐ నచ్చజెప్పే ప్రయత్నం చేయగా రైతులు వినకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. అనంతరం రైతులందరూ సర్వే ఆపాలంటూ తహసీల్దార్‌ సునీతకు వినతిపత్రం అంజేశారు. రైతులు రాంరెడ్డి, అన్నారెడ్డి, లింగారెడ్డి, ముత్తరెడ్డి, సంపత్‌రావు, కృష్ణ, కొమురయ్య, సుధాకర్‌రావు, మహేందర్‌ పాల్గొన్నారు.

చిట్యాల : నవాబుపేట గ్రామంలో సోమవారం గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ కోసం తహసీల్దార్‌ ఖాజా మోహీనోద్దీన్‌ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు తమ ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులను సముదాయించిన తహసీల్దార్‌ పరిహారం విషయంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ భాస్కర్ల రాజు, బిల్ల సత్యనారాయణరెడ్డి, కసిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, దువ్వల నర్సయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని