logo

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం వెస్ట్‌జోన్‌ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు

Updated : 23 Apr 2024 05:42 IST

రూ.2 లక్షల నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం

 కేసు వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ సీతారాం

 జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం వెస్ట్‌జోన్‌ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా మైసూర్‌ బీమా అశ్విని ప్రాంతానికి చెందిన హరీష్‌ కార్లకు స్టిక్కరింగ్‌ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. జల్సాలకు అలవాటు పడి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలను ఎంచుకున్నారు. 2022 డిసెంబర్‌లో హరీష్‌ తన మిత్రులు దుర్గప్ప, కిష్టప్పలతో కలిసి నిజామాబాద్‌ జిల్లా కేశవాపూర్‌ గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన కారు అద్దాలు పగులగొట్టి రూ.13.30 లక్షలను చోరీ చేసి ముగ్గురు నిందితులు సమానంగా పంచుకున్నారు. అనంతరం 2023 మార్చి నెలలో హరీష్‌, దుర్గప్ప కలిసి ఆంధ్రప్రవేశ్‌ కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరులో బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగు నుంచి రూ.3.50 లక్షలను దొంగిలించారు. అలాగే సత్యసాయి జిల్లా కదిరి బ్యాంకు వద్ద పార్కు చేసిన ద్విచక్ర వాహనం సీటు లోపల ప్లాస్టిక్‌ కవర్లో ఉన్న రూ.17 లక్షలను చోరీ చేశారు. అలాగే ఈ ఏడాది మార్చి నెలలో హరీష్‌తో పాటు నిఖిలేష్‌, రాము అనే నిందితులు జడ్చర్లలో ద్విచక్ర వాహనం డిక్కీలో ఉన్న రూ.47వేలను అపహరించారు. అదే రోజు జనగామకు వచ్చిన ముగ్గురు నిందితులు ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకుని కారులో పెట్టుకున్నాడు. సదరు వ్యక్తి రోడ్డు పైన పార్కు చేసి ఐడీబీఐ బ్యాంకులోకి వెళ్లిన క్రమంలో నిందితులు కారు అద్దాలు పగులగొట్టి రూ.2లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు సదరు చోరీపై జనగామ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితుల గురించి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ రోడ్డు కళ్లెం కమాన్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలో ఉండగా, తిరిగి దొంగతనం కోసం వచ్చిన హరీష్‌ పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు నిఖలేష్‌ పరారీలో ఉన్నాడు. సదరు నిందితుడు పలు చోరీల కేసుల్లో పుణే, నాగ్‌పూర్‌, ముంబయి రాష్ట్రాల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి రూ.2లక్షల నగదు, రూ.3.50 లక్షల విలువైన రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడు హరీష్‌ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. నిందితులంతా కర్ణాటక వాసులు అని తేలిందన్నారు. అంతర్రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై మోదుగుల భరత్‌కు డీసీపీ సీతారాం రివార్డు అందించారు. సమావేశంలో సీఐ రఘుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని