logo

కబ్జా కోరల్లో చెరువులు..

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు

Published : 23 Apr 2024 04:14 IST

నియంత్రించకుంటే ఆనవాళ్లే దక్కవు..

గణపురం మండలం కుమ్మరికుంట చెరువులోకి నీరు వెళ్లకుండా కబ్జాదారులు పోసిన కట్టలు

 ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. పంటలు పండించడమే కాకుండా అదను చూసి వెంచర్ల నిర్మాణాలు సైతం చేపడుతున్నారు.  

జయశంకర్‌ భూపాలపల్లి, ఏటూరునాగారం, నర్సంపేట, న్యూస్‌టుడే

 గత వర్షాకాలంలో వరదలు వరంగల్‌ నగరాన్ని ముంచెత్తి ఏ విధంగా నష్టం మిగిల్చాయో తెలిసిందే. ఈ విపత్తుకు చెరువులు, నాలాల ఆక్రమణలే కారణమని గుర్తించారు.

భూపాలపల్లి పట్టణంలోని తుమ్మల, గోరంట్లకుంట, మహబూబ్‌పల్లి, గణపురం మండలంలోని చెల్పూరు ఎర్ర కాటారం పెద్ద చెరువుల్లో అక్రమార్కులు యథేచ్ఛగా పాగా వేస్తున్నారు.

ఇది ఏటూరునాగారంలోని ఆకులవారిఘణపురం ఓంపల్లి చెరువు. మత్తడిని సైతం దాటి వచ్చి సొంత పొలంలా సాగు చేస్తున్నారు. 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. దీని కింద 200 ఎకరాల మేర ఆయకట్టు ఉంది.


మహబూబాబాద్‌

  • మహబూబాబాద్‌ పట్టణ పరిధిలోని కృష్ణసాయికుంటలో ఇళ్లు నిర్మించుకున్నారు. గుముడూరు శివారులోని జగన్నాయకుల చెరువులో 40, బంధం.. 3.15, దామెరకుంట.. 10 ఎకరాల వరకు ఆక్రమణకు గురయ్యాయి. రామసముద్రం కుంట, గుండ్లకుంట, బేతోలులోని మైసమ్మకుంటల పరిస్థితి అలాగే ఉంది.
  • నెల్లికుదురు, కురవి మండలం నేరడ పెద్ద చెరువుల్లో వ్యవసాయ బావులు తవ్వారు.

    జనగామ

  • జనగామలో రంగప్ప, బతుకమ్మకుంట, గార్లకుంట చెరువు శిఖం భూముల్లో ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనూ నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌, నీటి పారుదల శాఖలు సమన్వయ లోపంతో వీటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు.
  • పాలకుర్తి మండలంలో పాలకుర్తి, వావిలాల గ్రామాల పరిధిలో, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో సైతం శిఖం భూములను ఆక్రమించారు. జఫర్‌గఢ్‌ మండలం షాపల్లి.. 7,  తిమ్మంపేట..3, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో నమిలికొండ..  5 ఎకరాల వరకు కబ్జాకు గురయ్యాయి.

    ములుగు..

* ఏటూరునాగారంలోని మానసపల్లి శివారులో గల లక్ష్మీనర్సయ్యకుంట మొత్తాన్ని ఆక్రమించి సాగు చేస్తున్నారు.
* ఆకులవారి ఘణపురంలోని 193 సర్వేనెంబర్‌లో గల జిన్నెమాకు కుంటలో నిర్మాణాలు వెలిశాయి. దీని పరిధిలో  వంద ఎకరాల శిఖం భూమి ఉంది.  సగానికిపైగా ఆక్రమణకు గురైంది. ఇదే గ్రామంలో 169 సర్వేనంబర్‌లోని 12 ఎకరాల రాళ్లకుంటను సైతం వదలడంలేదు. 46 సర్వే నంబర్‌లో గల గణేష్‌కుంట పరిస్థితి ఇలాగే ఉంది.
* ములుగు మండలం అబ్బాపురం  గ్రామ చెరువు విస్తీర్ణం 108 ఎకరాలు. ఇక్కడి రైతులు శిఖం భూమిలో సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 30 ఎకరాల మేర ఆక్రమణకు గురైందని.. సాగునీరు సరిపోవడంలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


హద్దుల ఏర్పాటులో నిర్లక్ష్యం..

శిఖం భూములకు హద్దులు గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పదేళ్ల కిందట  మొక్కలు నాటాలని నిర్ణయించినా అది ఆచరణలోకి రాలేదు. కొన్నిచోట్ల హద్దులున్నా.. వాటిని అక్రమార్కులు తొలగిస్తున్నారు.


విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
- ఇలా త్రిపాఠి, ములుగు జిల్లా కలెక్టర్‌

అక్రమార్కులపై కఠిన చర్యలుంటాయి. అక్కడి పరిధిలోని తహసీల్దార్లను అప్రమత్తం చేస్తాం.  


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని