logo

సర్కారు బడిలో విజన్‌-2026

డోర్నకల్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్‌-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు.

Published : 24 Apr 2024 02:46 IST

విద్యా ప్రమాణాలు, హాజరు శాతం పెంపు లక్ష్యం

డోర్నకల్‌లో సర్వే పత్రం, ప్రతిజ్ఞ పత్రం ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ బృందం

డోర్నకల్‌, న్యూస్‌టుడే: డోర్నకల్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్‌-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడంతో పాటు హాజరు శాతం పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. దీనిని పకడ్బందీగా అమలు చేయడానికి తొలుత విద్యార్థుల సామాజిక, ఆర్థిక, విద్య సామర్థ్య స్థాయిపై సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి 4 రోజుల పాటు విద్యార్థుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ నేపథ్యం తెలుసుకుంటారు. ఈ వివరాలను ఒక నివేదికలో పొందుపరిచి వారి భవిష్యత్తు పేరిట పత్రం ముద్రించి విద్యార్థి, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు ప్రతిజ్ఞ చేసి దానిని విద్యార్థుల ఇంటి తలుపునకు అతికిస్తారు. రెండేళ్లలో వ్యవధిలో నిర్దేశిత లక్ష్యం సాధనకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నడుం బిగించడం ఒక శుభ పరిణామం.  దీనిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

సేకరించే సమాచారం...

  • విద్యార్థుల సామాజిక, ఆర్థిక, విద్యా సామర్థ్య స్థాయి సర్వేలో విద్యార్థుల కుటుంబ వివరాలు, ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటారు.
  • ఆ తర్వాత పేద, మధ్య, ఉన్నత విభాగాల వారీగా అంచనా వేస్తారు. 
  • విద్యార్థి హాజరు 76-100 శాతం మధ్య ఉంటే బాగుందని, 75 శాతం సగటు అని, 75 శాతం లోపు ఉంటే తక్కువ అని నిర్థారిస్తారు. 
  • విద్యా సామర్థ్యాన్ని చాలా బాగుంది, పర్వాలేదు, నెమ్మదిగా నేర్చుకునే తత్వమనే కేటగిరిగా విభజిస్తారు.
  • విద్యార్థి గైర్హాజరుకు గల కారణాలు తెలుసుకొని చేపట్టాల్సిన చర్యలు నమోదు చేస్తారు.
  • అభిరుచులు, నైపుణ్యాలు తెలుసుకుంటారు
  • సర్వే చేసిన ఉపాధ్యాయులు విద్యార్థి స్థితి గురించి తన మనోగతం రాసి సంతకం పెట్టాలి.

కర్తవ్యాన్ని వెన్నుతట్టేలా..

సర్వేలోనే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడి ప్రతిజ్ఞ ఉంటుంది. ఇది వారి కర్తవ్యాన్ని వెన్నుతట్టేలా మేలుకొలుపుతుంది. ఇంటి తలుపులకు లేదా గోడలకు వీటిని అతికిస్తారు. విద్యార్థి పురోగతిపై ప్రధానోపాధ్యాయుడి చరవాణి సంఖ్య ముద్రించడం విశేషం.

  • ప్రతిజ్ఞ.. మా తల్లిదండ్రులు నా భవిష్యత్తు బాగుండాలని, సమాజంలో గొప్ప స్థానంలో నిలబడాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. వారి కలలు నెరవేరడం కోసం నేను ప్రతి రోజు పాఠశాలకు వెళుతూ.. క్రమశిక్షణతో మంచి మార్కులు సాధిస్తా.
  • తల్లిదండ్రుల ప్రతిజ్ఞ: మా కుమార్తె/కుమారుడు ప్రయోజకులై జీవితంలో మంచిగా స్థిరపడాలని కోరుకుంటున్నాం. ప్రతి రోజు పిల్లలను పాఠశాలకు పంపిస్తాం. మంచి స్నేహితులతో కలిసి మెలిసి ఉండేలా ప్రోత్సహిస్తాం.
  • ప్రధానోపాధ్యాయుడి ప్రతిజ్ఞ: మీ ఆకాంక్షలు, ఆశలు నెరవేరేలా ఉపాధ్యాయులు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతాం.

ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం

బి.నరసింహారావు, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీ పాఠశాల, డోర్నకల్‌

నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులు సంసిద్ధం కావాలి. దీనిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి దీనికి విజన్‌-2026 అని నామకరణం చేశాం. విద్యార్థులు విద్యా ప్రమాణాలు సాధించి పది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని మా ఆశయం. మా కార్యాచరణను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించి స్వాగతించారు. చదువులో వెనుకబాటు, బడికి రాకపోవడానికి గల కారణాలను సర్వే ద్వారా తెలుసుకొని లోటుపాట్లను అధిగమిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని