logo

‘భారాస, భాజపాలు తోడు దొంగలు’

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాసలు తోడుదొంగ పార్టీలని, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అన్నారు

Published : 30 Apr 2024 03:39 IST

తొర్రూరు, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాసలు తోడుదొంగ పార్టీలని, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలలో సోమవారం నిర్వహించిన వరంగల్‌ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. దేశం కోసం కుటుంబాలను సైతం త్యాగం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి ఉందన్నారు. ప్రధాని మోదీ అబద్దపు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. గత పదేళ్లలో భారాస ప్రభుత్వం తనపై అక్రమంగా 70 కేసులు పెట్టారని తెలిపారు. ఎంపీగా కడియం కావ్యను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న తనను గెలిపిస్తే ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం కడియం కావ్య మాట్లాడుతూ.. తనకు తొర్రూరుతో ఎంతో అనుబంధం ఉందని, తన అమ్మమ్మ ఊరు మండలంలోని కంఠాయపాలెం అన్నారు. తనను గెలిపిస్తే పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. భాజపాకు లాభం చేకూర్చడానికే భారాస నామమాత్రపు ఎంపీ అభ్యర్థులను బరిలో నిలిపిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని