నీట్‌ రాసి... టీచర్‌ అవుతానంది!

పదో తరగతి వరకూ ఎవరైనా ఆడుతూపాడుతూ చదివేస్తారు. పూర్తయ్యాకే... ‘తరవాతేంటి’ అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఈ తికమకలో చాలావరకూ అమ్మానాన్నలు, బంధువులు, స్నేహితులు... ఇలా ఎవరో ఒకరి సలహా అనుసరించేవారే ఎక్కువ.

Updated : 21 May 2024 03:13 IST

పదో తరగతి వరకూ ఎవరైనా ఆడుతూపాడుతూ చదివేస్తారు. పూర్తయ్యాకే... ‘తరవాతేంటి’ అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఈ తికమకలో చాలావరకూ అమ్మానాన్నలు, బంధువులు, స్నేహితులు... ఇలా ఎవరో ఒకరి సలహా అనుసరించేవారే ఎక్కువ. మరి అలా ఎంచుకున్న కోర్సుపై వాళ్లకు ఆసక్తి లేకపోతే? వాళ్ల ఆలోచనలకి అది సరిపడకపోతే? ఇదే ఆలోచించింది చేతన ధరావత్‌. ‘కనెక్ట్‌ స్పార్క్‌’ ప్రారంభించి... కెరియర్‌ సలహాలిస్తోంది. ఆ ప్రయాణాన్ని మనతో పంచుకుందిలా...

కెరియర్‌ విషయంలో చాలామంది ఎవరో ఒకరి సలహాను తీసుకోవడమో, ఇతరులను అనుసరించడమో చేస్తుంటారు. కానీ అదంతా అవతలివాళ్ల ఆసక్తులు, అనుభవాల ఆధారంగా ఉంటుంది. అది వీళ్లకి సరిపడకపోతే? ఇదే పరిస్థితి నాకూ ఎదురైంది. మాది హైదరాబాద్‌. నాన్న వేణుకుమార్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌. అమ్మ ఆశాలత. పదోతరగతి పూర్తయ్యాక ఏం ఎంచుకోవాలి అన్న ప్రశ్న ఎదురైంది. అమ్మానాన్నలు చెప్పేదొకటి, నాకు నచ్చింది మరొకటి. తరవాత ఒక్కోదాని గురించీ తెలుసుకున్నాక ఇంటర్‌లో ‘పీసీఎం’ ఎంచుకున్నా. నిజానికి మాకు స్కూల్లో కెరియర్‌ కౌన్సెలర్లు ఉంటారు. ఇంటర్నెట్‌ సదుపాయం ఉంది. అలాంటి నాకే ఇంత తికమక ఎదురైతే... అసలు మార్గనిర్దేశం చేసేవాళ్లే లేని వాళ్ల పరిస్థితేంటి అనిపించింది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకూ...

ఓరోజు మా పనిమనిషి వాళ్లఅమ్మాయికి ఇంగ్లిష్‌ పాఠాలు చెబుతున్నా. తనప్పుడు పదోతరగతే. నా పరిస్థితి గుర్తొచ్చి, భవిష్యత్తులో ఏం అవ్వాలనుందని అడిగా. ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌’ అంది. మరి ఏం చదవాలో తెలుసా అంటే... ‘అందుకే ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుంటున్నా’ అంది. ఎంపీసీ చదివితే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిపోతారా అంటే తెల్లముఖం వేసింది. ఇంకోసారి మరొకమ్మాయిని ఇదే ప్రశ్నడిగితే ‘నీట్‌ రాసి, టీచర్‌ అవుతా’నంది. నీట్‌ వైద్యవిద్య ప్రవేశపరీక్ష అన్నదే ఆమెకు తెలియదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కెరియర్‌ కౌన్సెలింగ్‌ ఎంత అవసరమో అప్పుడే నాకర్థమైంది. పనిమనిషి వాళ్లమ్మాయిని తన స్నేహితురాళ్లను తీసుకురమ్మని చెప్పి, పది పూర్తయ్యాక ఏమేం ఉంటాయి? ఆపై ఏది ఎంచుకుంటే ఏ కెరియర్‌లో కొనసాగొచ్చు అనేవి చెప్పడమే కాదు, వాళ్ల సందేహాలనూ తీర్చా. మా మేనత్త స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌. తనతో మాట్లాడి, వాళ్ల స్కూలు విద్యార్థులకూ... ఆపై హైదరాబాద్, తెలంగాణల్లోని కొన్ని పాఠశాలల్లో నా స్నేహితురాలు వెన్నెలతో కలిసి అవగాహన కలిగించా.

వాళ్లంతా చేయి కలిపారు...

మనదగ్గరే కాదు... అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అని అర్థమయ్యాక కౌన్సెలింగ్‌ విస్తృతం చేయాలనుకున్నా. గతంలో ఓ పోటీపరీక్షలో పాల్గొన్నప్పుడు దేశీయంగానే కాదు, అంతర్జాతీయ విద్యార్థులూ పరిచయమయ్యారు. వాళ్లందరితో తాజా పరిస్థితి, నా ఆలోచనను పంచుకుంటే ఏడుగురు చేయి కలిపారు. అలా ఈ ఏడాది ప్రారంభంలో ‘కనెక్ట్‌స్పార్క్‌’ మొదలుపెట్టా. తొలిరోజుల్లో పదోతరగతి వారికే ఆపై ఎనిమిది, తొమ్మిదితోపాటు ఇంటర్‌ వాళ్లకీ తరగతులు కొనసాగించాం. ఎన్‌జీఓలతో కలిసి, అయిదు రాష్ట్రాలకు మా సేవలను విస్తరించాం. తాజాగా నేపాల్‌ నుంచీ పిలుపొచ్చింది. వాలంటీర్ల సంఖ్యా 13కు చేరింది. అయితే సంప్రదించే పాఠశాలలు పెరగడంతో ఎక్కువమందికి చేరుకోలేం అనిపించింది. దీంతో టీచర్లకు శిక్షణివ్వడం మొదలుపెట్టాం. అవసరమైన మెటీరియల్‌నీ మేమే అందిస్తాం. ఇందుకోసం కెరియర్‌ కౌన్సెలర్లనీ సంప్రదించా. నేను దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పన్నెండో తరగతి చదువుతున్నా. వయసు 16 ఏళ్లే. దీంతో మొదట నా ఆలోచన చెప్పినప్పుడు తిరస్కరణలే వచ్చాయి. కొందరైతే ‘చదువుపై దృష్టిపెట్ట’మని సలహానిచ్చారు. కానీ, నేను నా పరిస్థితినే ఉదాహరణగా చెప్పి ఒప్పించేదాన్ని. చిన్న సమస్య అనుకుంటారు కానీ... మన విద్యార్థులకు కెరియర్‌ కౌన్సెలర్ల అవసరం చాలా ఉంది. మన దగ్గర 700 రకాల కెరియర్లు ఉంటే... చాలామందికి తెలిసింది మహా అయితే ఏడే. ఏదో ఒకటని ఎంచుకుని, చదవలేక మానేస్తున్నవారూ ఎక్కువే. అందుకే ఆప్షన్లు... వాటిల్లో తగినదేంటో తెలుసుకున్నాకే ఎంచుకోవాలన్నది నా ప్రయత్నం. ఇప్పటివరకూ 400 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. టీచర్ల ద్వారా మరింత మందికి చేరువవుతున్నాం. ఓవైపు చదువుకుంటూనే సంస్థ బాధ్యతలూ నిర్వహిస్తున్నా. మా సేవలను దేశవ్యాప్తం చేయాలి, పెద్దయ్యాక పాలసీలు తీసుకొచ్చే స్థాయికి చేరాలన్నది నా కల.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్