logo

ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్‌

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్‌(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.

Published : 01 May 2024 06:03 IST

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్‌(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామకం చేసిన నర్సింగ్‌ ఆఫీసర్స్‌ 120 మందికి విధుల్లో చేరిన 15రోజుల్లో ఉద్యోగ గుర్తింపు పత్రాలతో పాటు జిల్లా ఖజానా నుంచి వేతనం అందించేలా ఏడీ అవసరమైన దస్త్రాలను సిద్ధం చేయాల్సి ఉంది. అయితే వారు విధుల్లో చేరి రెండునెలలు గడిచినా ఎలాంటి ముందడుగు పడలేదు. పైగా డబ్బులిస్తేనే దస్త్రం కదులుతుందని మధ్యవర్తుల ద్వారా సెక్షన్‌ ఉద్యోగులు వసూళ్లకు పాల్పడ్డారు. ఈ విషయంపై గత నెల 14న ఈనాడులో ‘అందని వేతనాలు.. అడిగితే వసూళ్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. కొత్త ప్రభుత్వం వచ్చాక నియామకం చేసిన ఉద్యోగుల నుంచి మామూళ్ల వసూలును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ అంబి శ్రీనివాస్‌ విచారణ చేశారు. జిల్లా ట్రేజరీ అధికారులతో మాట్లాడి నర్సింగ్‌ ఆఫీసర్లకు ఈ నెల 25న ఉద్యోగ గుర్తింపు పత్రాలు అందజేశారు. సీపీఎస్‌ నంబరు కోసం జిల్లా ఖజానా అధికారికి వివరాలు పంపించి, వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని మాట్లాడారు. అదే సమయంలో నర్సింగ్‌ ఆఫీసర్లకు వేతనాలు ఆలస్యం కావడానికి కారకులైన ఏడీ, ఇతర సెక్షన్‌ ఉద్యోగులపై అధికారులు విచారణ చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఏడీ లక్ష్మిరాజంను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని